Jul 04,2023 22:03

వన్డే ప్రపంచకప్‌ రేసునుంచి జింబాబ్వే ఔట్‌..
ఐసిసి వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌

హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫై గ్రూప్‌ దశలో అప్రతిహత విజయాలతో సూపర్‌ా6కి ప్రవేశించిన జింబాబ్వేకు నిర్ణయాత్మక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ గండి కొట్టింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు స్కాట్లాండ్‌ చేతిలో 31పరుగుల తేడాతో ఓడి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో మరోసారి విఫలమైంది. మంగళవారం జరిగిన సూపర్‌6 నిర్ణయాత్మక మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ జట్టు 50ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234పరుగులు చేసింది. మిఛెల్‌ లిస్క్‌(48) టాప్‌ స్కోరర్‌. విలియమ్స్‌కు మూడు, ఛటారాకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో జింబాబ్వే జట్టు 13పరుగులకే రెండు, 37పరుగులకొచ్చేసరికి 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో రియాన్‌ బర్ల్‌(83), మధ్వెరా(40) స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ ఔటయ్యాక లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ ఘోరంగా నిరాశపరిచారు. దీంతో జింబాబ్వే జట్టు 41.1 ఓవర్లలో 203పరుగులకే కుప్పకూలింది. సోలేకు మూడు, ముల్లెన్‌, లిస్క్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సోలేకు లభించింది. స్కాట్లాండ్‌ానెదర్లాండ్స్‌ జట్ల మధ్య గురువారం జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించనుంది. శ్రీలంక జట్టు సూపర్‌ా6లో మూడు వరుస విజయాలతో ఇప్పటికే అర్హత సాధించగా.. జింబాబ్వే జట్టు సూపర్‌ా6లో నెదర్లాండ్స్‌పై గెలిచి శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్ల చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.