- యాప్ పనిచేయక అవస్థలు
- ఆందోళనలో ట్రాన్స్‌పోర్టు యజమానులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్.. ట్రాన్స్‌పోర్టు రంగంలో సమస్యలు సృష్టిస్తోంది. లారీలు, బస్సులు ఇతర వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, రోడ్ పర్మిట్లను ఇప్పటి వరకూ మాన్యువల్ పద్ధతిలో ఉండేవి. యజమానులు డబ్బులు చెల్లించగానే ఇచ్చే రసీదులను వాహనాల డ్రైవర్లకు ఇచ్చి పంపేవారు. ఆ వాహనం దేశంలోని ఏ రాష్ట్రంలోకి వెళ్లినా రవాణాశాఖ అధికారులు పర్మిట్లు అడిగిన వెంటనే తమ వద్ద ఉండే పేపర్లను చూపేవారు. ఎంవి యాక్ట్‌ను కేంద్రం సవరించడంతో రవాణా శాఖ సేవలన్నీ దాదాపు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి పోయాయి. ఇప్పుడు వాహనాలకు సంబంధించి ఫిట్‌నెస్, పర్మిట్లు, రోడ్ ట్యాక్స్ తదితర సేవలు అందించే ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకుంది. ఇందు కోసం కేంద్రం వాహన్ యాప్‌ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వాహన్ యాప్‌ను వాడేందుకు నిరాకరించి పాత పద్ధతుల్లోనే సేవలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వాహన్ యాప్ అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం యజమానుల పాలిట శాపంగా మారింది. ఈ యాప్‌లో పర్మిట్లు, రోడ్ ట్యాక్స్, ఫిట్‌నెస్ తదితర సేవలకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తున్నారు.
అయితే ఒక్కోసారి రోడ్డు ఎక్కాక ఈ యాప్ పనిచేయకపోతే డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. యాప్ యాక్టివేట్ రవాణా శాఖ అధికారులు చూసే వరకూ గంటల తరబడి వాహనాలను నిలిపి వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు డ్రైవర్లకు మరింత సమస్యలను సృష్టిస్తోంది. రవాణా శాఖ అధికారులకు తనిఖీల్లో చూపకపోవడంతో డ్రైవర్లు కట్టామని చెప్పినా వినకుండా గంటల కొద్దీ వాహనాలను నిలిపేస్తున్నారు. వాహన్‌లో సేవలకు సంబంధించి డబ్బు చెల్లించినా కొన్ని సేవలు యాప్‌లో అప్‌లోడ్ కాని పరిస్థితి ఉంది. పాత పద్ధతిలో వెంటనే వచ్చే ఎన్‌ఒసిలు ఈ వాహన్ యాప్‌లో నెలరోజులైనా అప్‌లోడ్ కాని పరిస్థితి కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సమస్యలను సృష్టిస్తోందని వాహన యజమానులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వాహన్ యాప్‌ను పకడ్బందీగా రూపొందించే వరకూ రాష్ట్రంలో ఈ యాప్ ప్రక్రియను నిలుపుదల చేసి వాహన యజమానులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు.










