ప్రజాశక్తి-కోవూరు (నెల్లూరు) : కోవూరులోని పాటూరు రోడ్డు వద్ద సీతా పోలయ్య భవనంలో ప్రజానాట్యమండలి నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సప్దర్ హష్మీ 69 వ జయంతి వేడుకలు కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సప్దర్ హష్మీ జయంతిని పురస్కరించుకొని... ముందుగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య, ఉపాధ్యక్షులు వేణు రత్నయ్య సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు నరసయ్య, డప్పు కళాకారులు తల్లు శ్రీనివాసులు, సభ్యులు కలిసి హష్మీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య మాట్లాడుతూ ... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో జండాపూర్ వద్ద ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచే హల్లాబోల్ వీధినాటకం ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన సప్దర్ హష్మీ ఈనాడు మన ముందు లేరని అందుకే ఈరోజు వారిని స్మరించుకుంటున్నామని ప్రజానాట్య మండలి నాయకులు కొనియాడారు. ఆయన ఢిల్లీలో చదువుకునే రోజుల్లో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై వీధి నాటకాలు ద్వారా ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించుకుని వీధి నాటకం ప్రదర్శిస్తుండగా 1989వ సంవత్సరంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురయ్యారని చెప్పారు. ఈరోజు ప్రజానాట్యమండలి తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది కళాకారులని సినీ పరిశ్రమకు అందించింది అని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. ప్రజానాట్యమండలి ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులు నుంచే నాటకాల్ని ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులు చేసి సమాజాన్ని మార్చే దిశగా పయనించడానికి నడుము కడుతుందని అందుకోసం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రజానాట్యమండలి కళాకారులను బలపరచాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, అఫ్రోజ్, చాంద్ బాషా, హౌమాయన్, కాలేశా, ఖాదర్బాషా, సురేష్, మల్లికార్జున, బాబు, సురేంద్ర, రమేష్ , సుభాషిని, రత్నమ్మ, నాగమ్మ, తదితరులు ఉన్నారు.










