- త్రిభాషలో సంస్కృతాన్ని ఎప్పుడు చేర్చారు ? : పిడిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పాఠశాల విద్యలో మూడవ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలి లో విద్యావ్యవస్థ బలోపేతంపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. మూడవ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, హిందీ కూడా కొనసాగుతుందని చెప్పారు. హిందీ, సంస్కృ తాల్లో ఏదో ఒకదానిని మూడవ భాషగా విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
సంస్కృతాన్ని థర్డ్ లాంగ్వేజిగా నిర్ణయిస్తూ సవరణ ఎప్పుడు జరిగిందో తెలవడం లేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంక టేశ్వరరావు, షేక్ సాబ్జి అన్నారు. మంగళవారం వారు మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఇంతవరకు స్కూల్ ఎడ్యుకేషన్ త్రిభాష సూత్రంలో ఫస్టు లాంగ్వేజి తెలుగు, సెకండ్ లాంగ్వేజి హిందీ, థర్డ్ లాంగ్వేజి ఇంగ్లీషు ఉన్నాయని తెలిపారు. ఇంగ్లీషు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంగ్లీషును ఏ లాంగ్వేజిగా ప్రకటిస్తుందో చెప్పాలన్నారు. సంస్కృతం ప్రజల భాషకాదని అన్నారు. కేంద్రం ఆదేశించిందని థర్డ్ లాంగ్వేజిగా తీసుకువచ్చారో? లేక మార్కుల కోసం తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. దీనిపై మంత్రి ని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు.
ప్రధానోపాధ్యాయులకు నోటీసులు సరికాదు
విద్యార్ధులు మధ్యాహ్న భోజనం తినకపోతే ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. సమగ్రశిక్షలో పనిచేసే వారికి మూడు నెలలుగా జీతాలివ్వడం లేదన్న అంశాన్ని మండలిలో ప్రస్తావించామన్నారు. త్వరలో వీరికి వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఓసి రైతులకు రైతు భరోసా అమలుకు గత చట్టానికి సవరణ చేయాలని కోరామన్నారు. నాలుగు ఎకరాలు చేసే కౌలు రైతుకు, ఎకరం చేసే రైతుకు ఒకేరకంగా రూ.13,500 రైతుభరోసా ఇవ్వడంలో ఎటువంటి సమానత్వం ఉందో ప్రభుత్వం తెలపాలన్నారు. దీనిపైన వ్యవసాయ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరానికి కేంద్రం ఐదేళ్ళలో ఎంత మొత్తంలో నిధులు విడుదల చేసిందని అడిగిన ప్రశ్నను అనుంబంధ ప్రశ్నగా పేర్కొంటూ జలవనరులశాఖ మంత్రి సమాధానం దాటవేశారన్నారు. ఐదేళ్లలో నీటి ప్రాజెక్టులకు రూ.61,573.15కోట్లు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని, ఈ మొత్తంలో 52 శాతం రూ. 32,059.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.










