ప్రజాశక్తి- తిరుమల : కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు వేతనం పెంచనున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టిటిడి చైర్మన్ మీడియాకు వెల్లడించారు. టిటిడిలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.12 వేల వేతనాన్ని రూ.17 వేలకు పెంచుతూ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. టిటిడి పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతాలను మూడు శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు అకాల మరణం పొందితే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించాలని తీర్మానించినట్లు చెప్పారు. ఇఎస్‌ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్‌మెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయిస్తూ పాలక మండలి ఆమోదించిందని తెలిపారు. వరాహస్వామి అతిథి గృహం నుంచి అవుటర్ రింగు రోడ్డు వరకు రూ.10.80 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానానికి ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలోని చెర్లోపల్లి నుంచి మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. టిటిడి పరిధిలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమెట్టు వరకు రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఇఒ ఎవి.ధర్మారెడ్డి, దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, కమిషనర్ సత్యనారాయణ, జెఇఒలు సదా భార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.










