May 28,2023 22:04

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్‌ అస్ట్లీ సబలెంక శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సబలంక 6-3, 6-2తేడాతో కోస్ట్‌యుక్‌(ఉక్రెయిన్‌)పై వరుససెట్లలో నెగ్గింది. ఇక అన్‌సీడెడ్‌ ఫెర్నాండెజ్‌(కెనడా) 6-3, 1-6, 6-3తో 21వ సీడ్‌ లినెట్టె(పోలండ్‌)కు షాక్‌ ఇవ్వగా.. అర్జెంటీనాకు చెందిన పొడొరొస్కా 6-0, 6-2తో ఫ్రాన్స్‌కు చెందిన పొండెట్‌పై నెగ్గి రెండోరౌండ్‌లకు ప్రవేశించింది.
సిట్సిపాస్‌ చెమటోడ్చి..
పురుషుల సింగిల్స్‌లో 5వ సీడ్‌, గ్రీక్‌కు చెందిన స్టెఫొనస్‌ సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లో గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. తొలిరౌండ్‌ పోటీలో సిట్సిపాస్‌ 7-5, 6-3, 4-6, 7-6(9-7)తో పోరాడి నెగ్గాడు. తొలి రెండు సెట్‌లను చేజిక్కించుకున్న సిట్సిపాస్‌కు మూడో సెట్‌లో అనూహ్యంగా పోటీ ఎదురైంది. ఆ సెట్‌ను చేజార్చుకోవడంతో నాల్గో సెట్‌ పోటా పోటీగా సాగింది. ఆ సెట్‌లో ఇరువురు ఒక్కో పాయింట్‌ సాధిస్తూ 6ా6వద్ద నిలువగా.. టైబ్రేక్‌లో సిట్సిపాస్‌ 9-7పాయింట్లతో గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. మరో పోటీలో 11వ సీడ్‌ ఖచనోవ్‌ 3-6, 1-6, 6-2, 6-1, 6-3తో ఫ్రాన్స్‌కు చెందిన లెస్టెన్నేపై ఐదుసెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. మరో ఉత్కంఠ పోరులో 13వ సీడ్‌ హుర్క్‌రాజ్‌(పోలండ్‌) 6-3, 5-7, 6-4, 2-6, 6-4తో గోఫిన్‌(జర్మనీ)పై, 24వ సీడ్‌ కొర్డా(అమెరికా) 6-4, 7-5, 6-4తో మెక్‌ డొనాల్డ్‌(అమెరికా)పై వరుససెట్లలో నెగ్గాడు. మరో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో రుబ్లేవ్‌(ఆస్ట్రేలియా) 1-6, 6-3, 6-4, 3-6, 6-1తో అర్జెంటీనాకు చెందిన అకొస్టాపై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు.