Jul 15,2023 10:17
  • ఏ బ్యాంక్‌ ఖాతాదారు అయినా వాడొచ్చు
  • డెబిట్‌ కార్డ్‌ లేకుండా నగదు ఉపసంహరణ

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) కొత్తగా యోనో యుపిఐ యాప్‌ను తెచ్చింది. ఎస్‌బిఐలో ఖాతా లేని వారు కూడా.. ఏ బ్యాంక్‌ ఖాతాదారు అయినా ఈ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి లావాదేవీలు చేయడానికి వీలు కల్పించింది. దీని కోసం వినియోగదారులు ఎస్‌బిఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. అనంతరం 'న్యూ టు ఎస్‌బిఐ'ను క్లిక్‌ చేసి 'రిజిస్టర్‌ నౌ'పై నమోదు చేసుకుంటే సరిపోతుందని ఆ బ్యాంక్‌ తెలిపింది. తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ సేవలను ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 'యోనో ఫర్‌ ఎవ్రీ ఇండియన్‌' ట్యాగ్‌లైన్‌తో దీన్ని ఆవిష్కరించామని వెల్లడించింది. ఈ యాప్‌ ద్వారా స్కాన్‌ అండ్‌ పే, పే బై కాంటాక్ట్స్‌, రిక్వెస్ట్‌ మనీ తదితర లావాదేవీలు చేయడానికి సౌలభ్యం ఉందని పేర్కొంది. అదే విధంగా డెబిట్‌ కార్డ్‌ లేకుండానే నగదు ఉపసంహరణ చేసుకునే సౌలభ్యం ఈ యాప్‌లో ఉందని తెలిపింది. ఐసిసిడబ్ల్యు సౌకర్యం ఉన్న ఎటిఎంలో ఏ బ్యాంక్‌ ఖాతాదారు అయినా ఎస్‌బిఐ యోనో ద్వారా యుపిఐ క్యూఆర్‌ క్యాష్‌ అప్షన్‌ ద్వారా నగదు తీసుకోవచ్చని వెల్లడించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతమున్న ఇతర యుపిఐ యాప్‌లకు ఎస్‌బిఐ తీవ్ర పోటీని ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.