- సత్యసాయి జిల్లా గార్మెంట్స్ పరిశ్రమల్లో వెట్టిచాకిరీ
- 15 ఏళ్లుగా ఏర్పాటవని వేజ్ బోర్డు కమిటీ
- ఏళ్ల తరబడి కార్మికులకు అరకొర వేతనాలే
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లాలోని గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేస్తోన్న కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నాయి. అందరూ మహిళలే పని చేస్తున్న ఇక్కడి పరిశ్రమల్లో కార్మికులకు ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలలోపే వేతనం ఇస్తున్నారు. ఈ జిల్లా సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని గార్మెంట్స్ పరిశ్రమల్లో కార్మికులకు నెలకు వేతనం రూ.15 వేల వరకు చెల్లిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 సంవత్సరాలుగా సవరించకపోవడమే ఇందుకు కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పాత వేతనాలను ఇక్కడి పరిశ్రమల యజమానులు అమలు చేస్తూ కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా రని విమర్శిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, చిలమత్తూరు, పరిగి, లేపాక్షి, సోమందేపల్లి మండలాల్లో 12 గార్మెంట్స్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 20 వేల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తే అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.3,500, స్కిల్డ్ కార్మికులకు రూ.5,500 మాత్రమే నెల బేసిక్ వేతనం ఉంది. ఒటిలు, బోనస్‌లు అన్నీ కలిపి వచ్చే వేతనం రూ.7 వేలకు మించడం లేదు. ఈ జిల్లాకు రెండు కిలోమీటర్ల దూరంలో తూముకుంట పారిశ్రామిక వాడ పక్కన కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతంలో ఉన్న గార్మెంట్ పరిశ్రమల్లో ఇదే పనిచేస్తున్న అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.7,500, స్కిల్డ్ కార్మికులకు రూ.10,500 బేసిక్ వేతనం ఉంది. వారికి గరిష్టంగా రూ.15 వేల వరకూ వేతనం లభిస్తోంది.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కార్మిక శాఖ మంత్రే అయినా...
శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఉన్నారు. ఇక్కడి కార్మికుల సమస్యలపై ఆయన దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినిమం వేజ్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి కనీస వేతనాలను పున:సమీక్షించపోవడం పట్ల కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ మినిమం వేజే బోర్డు అధ్యక్షులను నియమించినా కమిటీ సభ్యులను నియమించలేదు. దీంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు ఎంత ఉండాలన్న దానిపై నిర్ణయం జరగలేదు. దీనివల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వేతనాలు పెంచాలని ఆందోళనకు దిగినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పైగా ప్రభుత్వ నిబంధనలు తాము పాటిస్తున్నామని బుకాయిస్తున్నాయి. ఆందోళనకు దిగిన కార్మికులపై చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ప్రభుత్వం కనీస వేతనాలను పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. గార్మెంట్స్ కార్మికులు తొమ్మిది గంటలపాటు విరామం లేకుండా పనిచేస్తున్నారు. అయినా, వారికి వేతనాలు ఆరేడు వేల రూపాయలకు మించి రావడం లేదు. ఇదే పనిచేస్తున్న కార్మికులకు పక్క రాష్ట్రంలో రూ.15 వేల వరకు అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలి.
-ఇఎస్.వెంకటేశ్,
సిఐటియు శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి










