- పంట చేతికొచ్చే సమయంలో పడిపోయిన ధర
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా రైతులకు వేసవి సాగు నిరాశను మిగుల్చుతోంది. ప్రతికూల వాతావరణంలో, విద్యుత్ కోతలను అధిగమించి రైతులు ఈ ఏడాది రొయ్యల సాగు చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యలకు మంచి ధర లభించింది. 30 కౌంట్‌కు రూ.610 చొప్పన అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేసవి సాగు కూడా లాభాల పంట పండిస్తుందని ఆశతో మార్చిలో రైతులు ఉత్సాహంగా సాగు ప్రారంభించారు. పంట చేతికొచ్చే సమయంలో ధర పతనం అవ్వడంతో లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం 100 కౌంట్ ధర 190 ఉంది. 50 కౌంట్ ధర రూ.260కు మించడం లేదు. 80 కౌంట్ ధర రూ.230 మాత్రమే ఉంది. అత్యధిక మంది రైతుల వద్ద 100 కౌంట్ ఉన్నాయి. కనీసంగా రూ.230 ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని వారు అంటున్నారు.
- ఆశలు ఆవిరి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల కుటుంబాలు ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలో 11 రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. 13 మంది ప్రధాన కొనుగోలుదారులు ఉన్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కోవిడ్ మొదటి దశ, రెండో దశలో విదేశాలకు ఎగుమతులు పూర్తిగా స్తంభించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించక తప్పలేదు. ఆ తర్వాత సానుకూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నవంబరులో అధిక వర్షాలు, డిసెంబర్, జనవరిలో విపరీతమైన చలి కారణంగా వైరస్‌లు విజృంభించాయి. వేల ఎకరాల్లో రొయ్యల పంట తుడిచిపెట్టుకుపోయింది. ప్రతికూల పరిస్థితులలో పంటను కాపాడుకున్న రైతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో మంచి ధర లభించింది. అదే ఆశతో రైతులు అధిక పెట్టుబడులు పెట్టి వేసవి సాగు చేశారు. ధరలు లేక ప్రస్తుతం నష్టాలు చవిచూస్తున్నారు. .
- అమలు కాని ప్రభుత్వ ధర
ప్రభుత్వం విద్యుత్ రాయితీలోనూ జోన్‌ల పేరుతో ఈ ఏడాది కోత విధించింది. మరోవైపు ఎరువుల మేత ధరలు విపరీతంగా పెరిగాయి. 100 కౌంట్‌కు కనీసం రూ.210 చెల్లించాలని ప్రభుత్వ నిబంధనలు విధించింది. ఆచరణలో అధికారుల పర్యవేక్షణ కొరవవండడంతో రైతులకు ఈ ధర కూడా దక్కట్లేదు. పెద్ద రైతుల వద్ద రూ.10 వ్యత్యాసంలో కొనుగోలు జరుగుతున్నా, చిన్న రైతులను దళారులు నిలువునా దోపిడీ చేస్తున్నారు. రూ.20 నుంచి రూ.30 వరకూ కోత విధిస్తున్నారు. పంటను నిల్వ చేసుకునే అవకాశాలు లేక దళారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
వేసవి నిరాశ పరిచింది : వై. వెంకటేశ్వరరావు, వేమవరం, ఐ.పోలవరం మండలం, కోనసీమ జిల్లా
ఈ ఏడాది వేసవి సాగు పూర్తిగా నిరాశ పరిచింది. ప్రభుత్వం రోజుకు 8 గంటలు విద్యుత్ కోత విధించింది. 5 ఎకరాలు కౌలుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తున్నాను. విద్యుత్ కోసం ఎకరాకు రూ.3,500 చొప్పున 8 ఎకరాలకు రోజుకు రూ.28 వేలు అదనపు ఖర్చు పెరిగింది. రొయ్యల మేత ధరలూ పెరగడంతో ఎకరా సాగుపై లక్ష రూపాయలు అదనపు భారం పడింది. ప్రస్తుతం 100 కౌంట్‌కు రూ.190కి మించి ధరల లభించడం లేదు. చిన్న రైతులు కోలుకునే పరిస్థితులు లేవు.
నష్టాలు తప్పట్లేదు వైడి.నూకరాజు, ఆక్వా రైతు, తాళ్లరేవు
రొయ్యల సాగు ఏటా నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నాను. ఒకప్పుడు సిరుల పంట పండింది. పెట్టుబడి విపరీతంగా పెరగడంతో సాగు భారమైంది. ధనిక రైతులు మాత్రమే సాగు చేసే పరిస్థితులు ఉన్నాయి. 5 ఎకరాల సాగుకు కనీసంగా రూ.15 లక్షలు పెట్టుబడి అవుతోంది. ప్రస్తుతం ధరలను బట్టి చూస్తే పంటు రూ.10 లక్షలకు మించి వచ్చే అవకాశం లేదు.










