Mar 24,2023 22:06

రోమ్‌: పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో రికార్డు గోల్స్‌తో దూసుకెళ్తున్నాడు. 2024 యూరో క్వాలిఫయింగ్‌లో భాగంగా లీచ్‌టెన్‌స్టెయిన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్‌ కొట్టాడు. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్‌ జట్టు 4-0గోల్స్‌తో గెలుపొందగా.. కెరీర్‌లో 197వ గోల్‌ కొట్టి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన రొనాల్డో.. తాజాగా పోర్చుగల్‌ తరఫున 120వ, అంతర్జాతీయ టోర్నీల్లో 100వ గోల్‌ను పూర్తి చేసుకున్నాడు. గత ఏడాది ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు కోల్పోయిన రొనాల్డో.. మళ్లీ జాతీయ జట్టు తరఫున మైదానంలోకి దిగడం ఇదే ప్రథమం. తొలి గోల్‌ను 51వ ని.లో పెనాల్టీని గోల్‌గా మలిచిన రొనాల్డో.. ఆ తర్వాత మరో 12 నిమిషాల తర్వాత ఫ్రీ కిక్‌ను గోల్‌ చేశాడు. ఫిఫా ప్రపంచకప్‌-2022లో పోర్చుగల్‌ జట్టు మొరాకో చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అలాగే కువైట్‌కు చెందిన బాడర్‌ అల్‌ాముతావా 196వ గోల్‌ను సాధించాడు. ఆదివారం జరిగే గ్రూప్‌-జేలో పోర్చుగల్‌ జట్టు లక్సెంబర్గ్‌తో రెండో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.