- హర్యానాలో అధికం
- జాతీయ సగటు కంటే 2.4 రెట్లు ఎక్కువ
- అసోంలో అత్యల్పం
- మొత్తం వ్యయంలో పట్టణాల వాటా 42 శాతం
- గ్రామీణ ప్రాంతాల వాటా 57 శాతం
- సిఎంఐఈ- సిపిహెచ్ఎస్ సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణపై మోడీ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. ప్రజలకు అవసరమయ్యే వైద్యాన్నీ ప్రజలకు క్షేత్రస్థాయిలో ఉచితంగా అందించలేకపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రజలు తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. గతేడాది నవంబర్‌లో భారతీయ కుటుంబాలు ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యయంపై రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి చెందిన కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే (సీఎంఐఈ-సీపీహెచ్ఎస్) ఆధారంగా అంచనాలు ఈ సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి.
ఈ కాలంలో (గతేడాది నంబంబర్) మొత్తం ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యయంలో పట్టణం భారతదేశం 42.3 శాతం వాటాను కలిగి ఉన్నది. మిగిలిన 57.7 శాతం ఖర్చు గ్రామీణ భారతదేశం నుంచి ఉండటం గమనార్హం. సీఎంఐసీ-సీపీహెచ్ఎస్ 1,78,677 గృహాల నుంచి 8,75,000 మందిని సంప్రదించి సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో కుటుంబాలు మందులు, వైద్యులు, ఆస్పత్రిలో చేరటం, ఆరోగ్య బీమా, వైద్యపరీక్షలు, వైద్య సహాయాలపై చేసిన ఖర్చులు గురించి ఉంటాయి.
42 శాతం ఖర్చు మందులపై
ఈ సర్వే సమాచారం ప్రకారం.. ఫిట్నెస్ సేవలు, పరిశుభ్రత ఉత్పత్తులు, పార్లర్లు, స్పాలతో సహా ఆరోగ్య మెరుగుదల సేవలు.. ఆరోగ్య సంరక్షణ వ్యయంలో అత్యధికంగా 45.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మందులపై చేసిన ఖర్చు 42.3 శాతంగా ఉన్నది. భారత్‌లో 6.7 శాతం మంది సాధారణ మందులు తీసుకుంటున్నారు. వృద్ధులలో ఈ వాటా అధికం. వైద్యల, ఫిజియోథెరపిస్టుల ఫీజులు 5.6 శాతం ఉండగా.. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యయంలో రెండు శాతం ఉంటుంది.
సగటు కుటుంబం చేసిన ఖర్చు రూ.3638
2018 ఆర్థిక సంవత్సరంలో సగటు భారతీయ కుటుంబం ఆరోగ్య సంరక్షణపై రూ. 3,632 లు ఖర్చు చేసింది. 2022 నాటికి ఇది స్వల్పంగా పెరిగి రూ.3,638కి చేరింది. 2018, 2019 ఆర్థిక సంవత్సరాల మధ్య సగటు కుటుంబాలు ఆరోగ్యంపై ఖర్చు చేయటంలో 23.3 శాతం పెరుగుదలను నివేదించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 16.3 శాతం పెరుగుదల నమోదైంది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి సమయంలో దేశంలో కఠినమైన లాక్డౌన్ కొనసాగుతున్నపుడు 2020 ఏప్రిల్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం గృహాలు చేసే మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గింది. 2020 ఫిబ్రవరిలో ఆరోగ్య సంరక్షణ వ్యయం రూ. 94 బిలియన్లుగా ఉండగా.. అది అదే ఏడాది ఏప్రిల్‌లో రూ. 43.8 బిలియన్లకు పడిపోవటం గమనార్హం. అలాగే, అదే నెలలో మందులపై దాదాపు 19 శాతం, ఆరోగ్య మెరుగుదల సేవలపై 66.4 శాతం ఖర్చులు తగ్గాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యత్యాసం
గ్రామీణ ప్రాంతాలలో.. రూ. 8 వేల లోపు నెలవారీ ఆదాయం కలిగిన కుటుంబాలు ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 304 వెచ్చించాయి. రూ.80 వేల కంటే ఎక్కువ నెలవారీ ఆదాయం కలిగిన కుటుంబాలు రూ.447 ఖర్చు చేశాయి. ఇక పట్టణ ప్రాంతాలలో ఇది వరుసగా రూ.344, రూ. 1275 గా ఉండటం గమనార్హం.
ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. ఆరోగ్య సంరక్షణ వ్యయంలో వ్యత్యాసం గణనీయంగా ఉన్నది. గతేడాది నవంబర్‌లో హర్యానాలోని కుటుంబాలు సగటున రూ.873 లు ఖర్చు చేశాయి. ఇది జాతీయ సగటు కంటే 2.4 రెట్లు అధికం. అలాగే, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ)తో పోల్చుకున్నా ఇదే ఎక్కువ. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఇది మిగత రాష్ట్రాలు, యూటీలతో పోల్చుకుంటే అతి తక్కువ రూ.223గా ఉన్నది. అయితే, ప్రపంచ ప్రమాణాలతో పోల్చుకుంటే మాత్రం భారత్‌లో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువగానే ఉన్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశంలోని ప్రజలు తమ జేబుల నుంచి ఖర్చు చేయటం, ప్రయివేటు ఆస్పత్రులపై ఆధారపడటం వంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని నిపుణులు, విశ్లేషకులు వెల్లడించారు.