జాతీయస్థాయిలో రెండు అవార్డులు
తిరువనంతపురం : దేశంలోనే ఉచిత వైద్యం అందించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా కేరళకు 2023 ఆరోగ్య మంథన్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని కారుణ్య ఆరోగ్య సకారుక్య పథకం (సిఎఎస్పి) వినియోగానికి సంబంధించి ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఎబిపిఎంజెఎవై వార్షిక వేడుకలకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీ ఆరోగ్యమంతన్ 2023 అవార్డులు ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న లబ్ధిదారులకు ప్రత్యేక సేవలు అందించినందుకుగానూ రాష్ట్రానికి ''ఉత్తమ కార్యకలాపాలు'' విభాగంలో అవార్డు లభించింది. కేరళ ఈ అవార్డును గెలుచుకోవడం వరుసగా ఇది మూడోసారి.
రూ.3,200 కోట్లకుపైగా ఉచిత వైద్య చికిత్సలు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద రోగులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, కార్యక్రమాలకు కూడా ఈ అవార్డు దక్కిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో సిఎఎస్పి సహా వివిధ పథకాల ద్వారా రూ.3,200 కోట్లకు పైగా ఉచిత వైద్య చికిత్సలు అందించామని తెలిపారు. గత రెండేళ్లలో దాదాపు 13 లక్షల మంది లబ్ధిదారులు సిఎఎస్పి పథకం కింద చికిత్స పొందారని పేర్కొన్నారు. ఈ అంశంలో గతేడాది కేంద్ర వాటాగా రాష్ట్రానికి రూ.151 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు.
ఎల్డిఎఫ్ హయాంలోనే... దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేక సేవలు
ఎల్డిఎఫ్ ప్రభుత్వ హయాంలోనే దృష్టి లోపం ఉన్న లబ్ధిదారుల కోసం ప్రత్యేక సేవలను ప్రారంభించారు. ఇందుకోసం వారి చికిత్స కార్డు బ్రెయిలీలో సెట్ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక అవార్డు లభించింది. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ హెల్త్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని 613 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల నుంచి లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.