టోరీ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై బ్రిటన్ పౌండ్ పుంజుకున్నది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌పై 0.4 శాతం లాభ పడి 1.134గా నిలిచింది. రుణ పరపతి వ్యయాలు తగ్గుముఖం పట్టాయి.
రాజీనామా చేసిన ప్రధాని లిజ్ ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్‌తో ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగిపోయాయి. డాలర్‌పై పౌండ్ ధర రికార్డు స్థాయిలో పతనమైంది. కొత్త ఆర్థిక మంత్రి జెరెమీ హంట్.. ప్రధాని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీ మేరకు సంపన్నులపై పన్నుల్లో కోత విధించినా మార్కెట్‌లో పరిస్థితులు కుదుట పడలేదు. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో పౌండ్ 1.11 స్థాయికి పడిపోయింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగిపోయాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతపై హెచ్చరికలు జారీ కావడం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. కానీ, ప్రధాని ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు జాన్సన్ ప్రకటించడంతోనే పౌండ్ తిరిగి పుంజుకున్నది.










