Sep 25,2023 11:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు సోమవారం విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు తరలి వస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై పోలీసులు ఎక్కడికక్కడే నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమంగా అరెస్ట్‌లు చేయడాన్ని వామపక్షపార్టీలు తీవ్రంగా ఖండించాయి. ధర్నాను విఫలంచేయడానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్భందాన్ని ప్రయోగించడం పట్ల సిపియం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, వై సాంబశివరావు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసి), జాస్తి కిషోర్‌బాబు (సిపిఐ(యంఎల్‌), కాటం నాగభూషణం (యంసిపిఐ(యు) ), యన్‌ మూర్తి (సిపిఐ(యంఎల్‌) లిబరేషన్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసి), బిఎస్‌ అమర్‌నాథ్‌ (యస్‌యుసిఐ(సి)), పివి సుందరరామరాజు( ఫార్వర్డ్‌బ్లాక్‌), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ)లు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇళ్ళవద్దనే అరెస్టు చేసి నిర్బంధించడం, వాహనాలను అడ్డుకోవడం, ధర్నాకు అనుమతినివ్వకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి పూనుకోకుండా నిర్బంధం ప్రయోగించడం దారుణమని అన్నారు. తమ న్యాయసమ్మతమైన కోర్కెలను ప్రభుత్వం దష్టికి తీసుకురావడం, నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.అని ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేసి, విజయవాడలో జరిగే మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
 

                                            మహాధర్నాకు అనుమతి నిరాకరించడం తగదు : కార్మిక సంఘాలు

రాష్ట్రంలోని అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు అనుమతిని నిరాకరించడం తగదని సిఐటియు, ఎఐటియుసి, ఐఫ్‌టియు రాష్ట్ర కమిటీలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఆదివారం సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సిహెచ్‌ నర్సింగ్‌రావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె పొలారిలు ఒక ప్రకటన విడుదల చేశారు.అంగన్‌వాడీల ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీల పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు వుంటుందని తెలిపారు.
 

                                                                    ఐద్వా మద్దతు : డి రమాదేవి

రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు వుంటుందని ఐద్వా ప్రకటించింది. ఈ మేరకు ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి రమాదేవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలపై నిర్బందాలను ఆపి వారి సమస్యలను చర్చించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.