జమ్మూకాశ్మీర్ అంశం తొలగింపు : ఎన్‌సిఇఆర్‌టి చర్యపై చరిత్రకారులు, విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
- మౌలానా ఆజాద్ గురించి కూడా..
- 11వ తరగతి రాజనీతి శాస్త్రం నుంచి
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత దేశ చరిత్రను మరుగునపరిచేందుకు పాఠ్యపుస్తకాల నుంచి కీలక అంశాలు, భాగాలు, పేరాలు, ప్రకటనలను తొలగిస్తున్నది. చరిత్రను కాషాయీకరించే యత్నాల్లో భాగంగా మొఘలుల పాలన, గాంధీజీ హత్య వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేసింది. తాజాగా భారత్‌లో జమ్మూకాశ్మీర్ విలీనానికి సంబంధించిన ప్రకటనను 11వ తరగతికి చెందిన పొలిటికల్ సైన్స్ పుస్తకం పదో చాప్టర్ నుంచి ఎన్‌సిఇఆర్‌టి పూర్తిగా ఎత్తివేసింది.
జమ్ముకాశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత అది స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందన్న హామీ మీద ఆధారపడి విలీన ప్రక్రియ జరిగిందన్నది ప్రకటన కీలకాంశం. ఈ ప్రత్యేక అంశాన్ని రాబోయే తరం తెలుసుకోకుండా మోడీ సర్కారు పుస్తకాల నుంచి తొలగించిందని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఎ) లను మోడీ సర్కారు తన రెండో టర్మ్ పాలనలో రద్దు చేసిన విషయం విదితమే. ఈ ఆర్టికల్‌ల రద్దు తర్వాత ప్రతిపక్షాలు, జమ్ముకాశ్మీర్‌లోని పౌర సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మోడీ సర్కారు నియంతృత్వ ధోరణిని తప్పుబట్టాయి. ఇది జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను హరించడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి.
భారత తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి గొప్ప పేరు సంపాదించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు చెందిన అన్ని రిఫరెన్సులను సైతం తొలగించడం గమనార్హం. పాత 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకం '' ఇండియన్ కానిస్టిట్యూషన్ ఎట్ వర్క్''లోని మొదటి చాప్టర్ నుంచి ఆజాద్‌కు సంబంధించిన అన్ని రిఫరెన్సులు తొలగించడం గమనార్హం.
ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలలో మొఘల్ చరిత్ర, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం, హిందూ-ముస్లింల ఐక్యతకు గాంధీ చేసిన కృషి వంటి అంశాలతోపాటు తాజాగా పైన పేర్కొన్న విషయాలనూ తొలగించడంపై దేశంలోని చరిత్రకారులు, విద్యానిపుణులు, సామాజికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగమే ఈ మార్పులని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా చేస్తే భారత దేశ వాస్తవ చరిత్రను విద్యార్థులు తెలుసుకోలేరనీ, ఇది దేశ అస్థిత్వానికే ప్రమాదమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం హేతుబద్ధంగా ముందుకు వెళ్లాలనీ, విద్యా నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని వారు తెలిపారు.
మౌలానా ఆజాద్ పేరు తొలగింపు దారుణం : సీతారాం ఏచూరి
'పాఠ్యపుస్తకాల నుంచి మౌలానా ఆజాద్ గురించి ప్రస్తావన తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీకార ధోరణితో చరిత్రను తిరగరాయడం, తప్పుడు భాష్యాలు చెప్పడం వంటివి ఆధునిక భారత దేశపు పునాదులుగా వున్న అన్ని పురోగామి నాగరికతలను నాశనం చేస్తుంది ' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ట్వీట్ చేశారు. దీని వల్ల ప్రపంచం ముందు భారత దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఆయన అన్నారు.










