న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ కాపిటల్ లిమిటెడ్ (ఆర్‌సిఎల్)కు చెందిన ఆస్తులను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎఆర్‌సి)కి విక్రయించాలని ఎల్‌ఐసి నిర్ణయించింది. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి ఈ నిర్ణయం తీసుకుంది. తనఖాగా పెట్టుకుని అప్పులిచ్చిన ఆర్‌సిఎల్, ఆ సంస్థ సబ్సీడరీలను స్వాధీనం చేసుకుంది. కాగా.. వీటిని ఎఆర్‌సిలకు విక్రయించాలని నిర్ణయించింది. వీటి బిడ్డింగ్‌కు నవంబర్ 28 చివరి రోజుగా ప్రకటించింది. ఆ ఆస్తుల అమ్మకానికి ఎఆర్‌సిల నుంచి బిడ్లను అహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆర్‌సిఎల్‌లో ఎనిమిది వ్యాపారాలున్నాయి. ఇందులో సాధారణ బీమా, జీవిత బీమా, వైద్య బీమా, సెక్యూరిటీ బిజినెసెస్, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ తదితర వ్యాపారాలు ఉన్నాయి.










