Jul 07,2023 22:12

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పరిమితి ఓవర్ల కెప్టెన్‌గా లింటన్‌ దాస్‌ ఎంపికయ్యాడు. ప్రస్తుత కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) నూతన సారథిని ప్రకటించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మిగిలిన వన్డేలకు లింటన్‌ దాస్‌ కెప్టెన్‌గా బ్యాధ్యతలు స్వీకరించనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తమీమ్‌ ఇక్బాల్‌ సారథ్యంలోని బంగ్లాజట్టు తొలి వన్డేలో 17పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో లింటన్‌ దాస్‌ సారథ్యంలోనే బంగ్లా జట్టు 546పరుగుల రికార్డుతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకైక టెస్ట్‌లో గెలుపొందింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు వన్డే శనివారం జరగనుండగా.. చివరి వన్డే 11న చిట్టగాంగ్‌లో జరగనుంది. వన్డే సిరీస్‌ ముగిసిన పిమ్మట ఆఫ్ఘన్‌తో టి20ల సిరీస్‌ జులై 14నుంచి ప్రారంభం కానుంది.