న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజుపై డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజులో 50-100 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సాధారణ గృహ రుణం, టాప్ అప్ రుణాలకు 50 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు పేర్కొంది. కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.2వేలు, గరిష్ఠంగా రూ.5వేలు ఉంటుంది. రీసేల్, రెడీ టు మూవ్ ప్రాపర్టీలకు అయితే 100 శాతం వరకు రాయితీ పొందవచ్చని తెలిపింది. అదే విధంగా గృహ రుణాలపై వడ్డీ రేటులోనూ తగ్గింపును ఇస్తున్నట్లు వెల్లడించింది. సిబిల్ స్కోర్ ఆధారంగా గరిష్ఠంగా 45 బేసిస్ పాయింట్లు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది.










