Apr 21,2023 09:55
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని 'ఇ-శ్రమ్‌' పోర్టల్‌లో నమోదైన వలస, అసంఘటిత కార్మికులందరికీ మూడు నెలల్లోగా రేషన్‌ కార్డులను అందజేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులకు డ్రై రేషన్‌, ఓపెన్‌ కమ్యూనిటీ కిచెన్‌లపై 2021లో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు హర్ష్‌ మందర్‌, అంజలి భరద్వాజ్‌, జగదీప్‌ చోకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. జనగణన చేపట్టకపోవడం, తాజా జనాభా లెక్కలు వివరాలు లేకపోవడం కారణంగా 10 కోట్ల మంది పైగా ప్రజలు రేషన్‌ బియ్యానికి కూడా నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013లో రక్షిత గొడుగు నుండి రేషన్‌ కార్డులు కూడా వీరికి మంజూరు కాలేదన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన ఆహార భద్రతా చట్టం కింద కవరేజీ ప్రస్తుత జనాభాకు ఎంతమాత్రమూ చాలదని, వెంటనే కవరేజీని పెంచి ప్రజలందరికీ తిండి గింజలు అందేలా చూడాలని కోరారు. ప్రశాంత్‌ భూషణ్‌ వాదనతో సానుకూలంగా స్పందించిన ధర్మాసనం తదునుగుణంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. 'ప్రస్తుతం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ప్రయోజనాలను పొందేందుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి రేషన్‌ కార్డులను జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో మూడు నెలలు సమయం ఇస్తున్నాం. కలెక్టర్ల కార్యాలయాన్ని సంప్రదించి విజ్ఞప్తి చేసినవారికీ, పోర్టల్‌లో నమోదైనవారికీ రేషన్‌ కార్డులు జారీ చేయాలి. తద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రయోజనాన్ని పొందవచ్చు' అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదివరకు తాము ఇచ్చిన ఆదేశాలపై స్థాయి నివేదికను నివేదించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3న వాయిదా వేసింది.
           ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదైన 28.55 కోట్ల మంది వలస, అసంఘటిత కార్మికులు రేషన్‌ కార్డులను కలిగి ఉన్నారా? వారందరికీ ఆహార ప్రయోజనాలను అందించారా? లేదా? అనేది తెలియజేయాలని గత విచారణలో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, గ్రామీణ, పట్టణ పేదలకు లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్‌) కింద సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందేందుకు కార్మికులు అర్హులేనని, పోర్టల్‌లో నమోదు మాత్రమే సరిపోదని ధర్మాసనం అప్పట్లో వ్యాఖ్యానించింది. ప్రభుత్వాల పథక ప్రయోజనాలు నిరుపేదలకు చేరడం అత్యవసరమని స్పష్టం చేసింది. వలస కార్మికులు ఎందరున్నారు? అసంఘటిత కార్మికుల సంఖ్య ఎంత? వంటి గణాంకాలకు సంబంధించిన సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలపై మాకు ఆసక్తి లేదు. దానికంటే మిన్నగా కార్మికులందరికీ తిండి గింజలు అందుతున్నాయా? లేదా? అనేదే మాకు ప్రధానం. దీనికి కావాల్సిన ఏర్పాట్టు చేయండి' అని ఈ కేసులో ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటికి జస్టిస్‌ ఎంఆర్‌ షా స్పష్టం చేశారు.