Feb 19,2023 22:02

కోల్‌కతా: ప్రతిష్టాత్మక రంజీట్రోఫీ2022-23 టైటిల్‌ను సౌరాష్ట్రజట్టు వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో సౌరాష్ట్ర జట్టు 9వికెట్ల తేడాతో బెంగాల్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 164పరుగులతో ఆదివారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన బెంగాల్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 241పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్ర జట్టు 12పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు 2.4 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 14పరుగులు చేసి రంజీ ట్రోఫీ టైటిల్‌ను చేజిక్కించుకుంది. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మనోజ్‌ తివారి(68), అనుస్తుప్‌ మజుందార్‌(61) మాత్రమే రాణించారు. ముకేశ్‌ కుమార్‌కు నాలుగు, ఇషాన్‌ పొరెల్‌, అక్ష్‌దీప్‌ చెరో మూడు వికెట్లు దక్కాయి. ఉనద్కత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. రంజీట్రోఫీ టైటిల్‌ను సౌరాష్ట్ర జట్టు గెలుచుకోవడం ఇది నాల్గోసారి. రంజీలలో బెంగాల్‌కు ఇది 15వ ఫైనల్‌ కాగా.. 14సార్లు రన్నరప్‌గానే నిలిచింది.