ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తప్పు జరిగింది కాబట్టే ప్రజల దృష్టిని మళ్ళించడానికి టిడిపి రచ్చ చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శాసనసభలో శుక్రవారం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ ఈ అవినీతిని మొదట కేంద్ర ప్రభుత్వ సంస్థలు గుర్తించి చర్యలు కూడా తీసుకున్నాయని చెప్పారు. ఐటి, జిఎస్‌టిలు స్కామ్ జరిగనట్లు గుర్తించాక సీమెన్స్ ఇండియా ఎమ్‌డి, డిజిటెక్ ఎమ్‌డిలను ఇడి అరెస్ట్ కూడా చేసిందన్నారు. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా కోట్టేసిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదని అంటే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడి అరెస్ట్ అంశంలో సభలో చర్చకు పిలిచినా టిడిపి ఎందుకు రావడంలేదని అన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో తప్పు జరిగిందనే చర్చకు రాకుండా తెలుగుదేశం రచ్చ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ డబ్బును కాజేసేందుకే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఫైళ్లు నడిపిన తీరును చూస్తే అర్థం అవుతుందన్నారు. ఇందుకోసం గంటా సుబ్బారావు అనే ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి ఎమ్‌డిగా పెట్టుకున్నారని తెలిపారు. సీమెన్స్‌తో చేసుకున్న అగ్రిమెంట్‌లో తేదీ కూడా లేదన్నారు. అగ్రిమెంట్ సీమెన్స్‌తో చేసుకుంటే నిధులను నేరుగా డిజైన్‌టెక్ అనే డొల్లకంపెనీకి విడుదల చేశారని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం సీమెన్స్ కంపెనీ 90శాతం నిధులను ఖర్చు చేస్తే ప్రభుత్వం 10శాతం ఇవ్వాలని వుందన్నారు. అయితే సీమెన్స్‌నుండి ఒక్క పైసా రాకుండానే 2015-16లో రూ 371 కోట్లు డిజైన్‌టెక్‌కు రిలీజ్ చేశారని తెలిపారు. డిజైన్‌టెక్ అందులో నుండి రూ 58.9 కోట్లను సీమెన్స్‌కు బదిలీ చేసి రూ 241 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని అన్నారు. ఐటి శాఖ నోటీసుల ఆధారంగా చంద్రబాబునాయుడు పిఎ శ్రీనివాసరావుకు సిఐడి నోటీసు ఇస్తే మరుసటిరోజే విదేశాలకు పారిపోయారని అన్నారు. నైపుణ్యానికి సంబందించిన స్కిల్స్ ఇంటర్‌నెట్‌లో ఉచితంగా లబిస్తాయని అలాంటివి పరిగణలోకి తీసుకోకుండా రూ 3,281కోట్లతో కట్టుకథలను తయారు చేసి రూ 371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. . కేంద్రం కూడా చర్యలు తీసుకున్న ఈ కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్ చేయకుండా సన్మానాలు చేయాలా అని ప్రశ్నించారు.
- విజనరీ కాదు ప్రిజనరీ - కురసాల కన్నబాబు
చంద్రబాబునాయుడు చట్టాలలో వున్న లసుగులను అడ్డంపెట్టుకొని ఇన్నేళ్లూ తానో విజనరీ అంటూ తప్పించుకు తిరిగారని, చంద్రబాబునాయడు విజనరీ కాదు ప్రిజనరీ అని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తేలిందని వైసిపి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. శాసనసభలో స్కిల్‌డెవలప్‌మెంట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడి రాజకీయ జీవితం అంతా అవినీతిమయమేనని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికన దొంగ అని చంద్రన్న కానుకలో బెల్లం కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో కేబినెట్‌లో తీర్మానించిందికాదని మరోలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. చంద్రబాబునాయుడు కేబినెట్‌ను కూడా తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేసి 17 మంది వాంగ్మూలాలను రికార్డు చేశారని అన్నారు.
- హవాలా ద్వారా చంద్రబాబుకు డబ్బులు చేరాయి - మాజీ మంత్రి పేర్ని నాని
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడుకు హవాలా ద్వారా డబ్బులు ముట్టాయని వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. సీమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజిటెక్‌కు ఎలా డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఐఎఎస్ అధికారుల అభ్యంతరాలను ఏవి పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఈ కేసులో నిబందనల ప్రకారం నిధుల విడుదల జరగలేదని కోర్టుముందు వాంగ్మూలం ఇచ్చిన వారు ఇపుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. ఈ కేసుతో తమకు సంబందంలేదంటున్న చంద్రబాబునాయుడు 13 చోట్ల సంతకాలను చేశారని తెలిపారు.










