ముంబయి : స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపులు వేదిక పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్‌కు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది. పేమెంట్ అగ్రిగేటర్ (పిఎ) సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదని స్పష్టం చేసింది. వివిధ పద్ధతుల ద్వారా ఇ-కామర్స్, వ్యాపారులకు వినియోగదారులు చెల్లింపులు చేస్తుంటారు. దీనికి పేటియం లాంటి డిజిటల్ చెల్లింపుల వేదికలు మధ్యవర్తులుగా వ్యవహారిస్తున్నాయి. కాగా.. ఆర్‌బిఐ నిర్ణయం తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేటియం పేర్కొంది. త్వరలోనే సంబంధిత అనుమతులు పొందుతామని విశ్వాసం వ్యక్తం చేసింది.










