Mar 22,2023 12:41
  • గ్రామసభలు, అభ్యంతరాలు తీసుకున్నామన్న సిఆర్‌డిఎ
  • జిప్లస్‌-1, 3 పద్ధతిలో నిర్మాణాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో పేదల ఇళ్ల కోసం మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల్లో కొత్తగా ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తరపున సిఆర్‌డిఎ కమిషనర్‌ గెజిట్‌ (రాజపత్రం) విడుదల చేశారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న యు1 (రిజర్వు), సి4 (రీజనల్‌ సెంటర్‌), 13 నాన్‌పొల్యూటింగ్‌ ఇండ్రస్టీ, సి4 (టౌన్‌సెంటర్‌్‌), ఎస్‌2 (ఎడ్యుకేషన్‌), సి3 (నైబర్‌హుడ్‌ సెంటర్‌్‌)జోన్లలో కొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో జిప్లస్‌-1, జిప్లస్‌-3 పద్ధతిలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పేదలకు అవసరమైన ఇళ్ల నిర్మాణం కోసం 2016 ఫిబ్రవరి 23వ తేదీన ఇచ్చిన మాస్టర్‌ప్లానులో మార్పులు చేర్పులు చేశామని, 2014 ఎపిసిఆర్‌డిఎ చట్టంలోని సెక్షన్‌ 41 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2022 అక్టోబరు 28న సిఆర్‌డిఎ పరిధిలో భూ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం చేసిన మార్పులు, చేర్పులపై జారీచేసిన గెజిల్‌ 1410కు సంబంధించి బహిరంగ ప్రకటన కూడా పేపర్లో ఇచ్చామని తెలిపారు. సిఆర్‌డిఎ చట్టం సెక్షన్‌ 41(3) ప్రకారం వాటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని కోరామని స్పష్టం చేశారు. 5,844 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, వారందరినీ వ్యక్తిగతంగా వచ్చి అభిప్రాయాలు చెప్పాలని కోరామని, అయితే ఎవరూ హాజరు కాలేదని గెజిట్లో పొందుపరిచారు. సిఆర్‌డిఎ కూడా 2022 నవంబర్‌ 14, 23 తేదీల్లో రాతపూర్వక ఫిర్యాదుల కోసం బహిరంగ విచారణ చేపట్టిందని వివరించారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మందడం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, నేలపాడు, తుళ్లూరు, దొండపాడు, అబ్బురాజుపాలెం, ఐనవోలు, వెంకటపాలెం, మల్కాపురం, వెలగపూడి, కురగల్లు, శాఖమూరు, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, నీరుకొండ పంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. వాటిల్లో వచ్చిన అభ్యంతరాలను, సూచనలను ఎపిసిఆర్‌డిఎ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పరిశీలించి 2023 మార్చి 17వ తేదీన సిఆర్‌డిఎలోని సెక్షన్‌ 41(4) అధారంగా మార్పులకు ఆమోదం తెలిపిందని వివరించారు. దీని ప్రకారం 2014 సిఆర్‌డిఎ మాస్టర్‌ప్లానులో మార్పులు చేర్పులు చేశామని స్పష్టం చేశారు. నూతన గెజిట్‌ ప్రకారం 2014 సిఆర్‌డిఎ చట్టంలో గతంలో పొందుపరిచిన జోనల్‌ మాస్టర్‌ప్లానులో మార్పులు చేసి 41(4), 17(2) ప్రకారం 900.97 ఎకరాల పరిధిలో అటాచ్డ్‌, సెమీ డిటాచ్డ్‌, డిటాచ్డ్‌, అపార్టుమెంట్లు, గ్రూప్‌ డెవలప్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. సర్వీసు అపార్టుమెంటు, పారిశ్రామిక అవసరాలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, హైపర్‌మార్కెట్‌, షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణాలకు ప్లాను ప్రకారం అవకాశం లేదని పొందుపరిచారు. అనుమతితో ఎటిఎంలు, చిన్న కార్యాలయాలు, పౌర సదుపాయాలు, మతపరమైన నిర్మాణాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.