Oct 16,2023 22:00

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన స్టీల్‌ప్లాంట్‌ను మోడీ సర్కారు అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌ రామారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 977వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ సింటర్‌ ప్లాంట్‌ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. రా మెటీరియల్‌ ఇచ్చి వడ్డీరేట్లను తగ్గిస్తే ప్లాంట్‌ లాభాల బాట పట్టనుందన్నారు. విస్తరణ పనులు చేపడితే వందలాది మందికి ఉపాధి అవకాశాలూ కల్పించవచ్చని తెలిపారు. ప్లాంటును కావాలనే బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. విలువైన స్టీల్‌ప్లాంట్‌ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కుట్రలు సాగుతున్నాయన్నారు. వాటిని కార్మికులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో ఉక్కు పరిరక్షణ దీక్షలు వెయ్యి రోజులకు చేరబోతున్న నేపథ్యంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు కె జగపతిరాజు, భాస్కర్‌రావు, జె వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ, ఎ శ్రీనివాస్‌, ఉమామహేశ్వరరావు, పట్టా రమేష్‌, సింహాచలం, కర్రి బాబూరావు పాల్గొన్నారు.