Sep 27,2023 22:17

- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి జాషువా కవితా పురస్కారం ప్రదానం
ప్రజాశక్తి-గుంటూరు:గుర్రం జాషువా సాహిత్యతత్వం ప్రకారం సామాజిక న్యాయం కేవలం అస్పృశ్యులకు సంబంధించిన అంశం కాదని, అది ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అన్ని పార్శ్వాలూ కలిగి ఉంటుందని పలువురు వక్తలు అన్నారు. జాషువా స్వచ్ఛమైన కవి అని కొనియాడారు. గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించారు. ఈ ఏడాది జాషువా కవితా పురస్కారాన్ని రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, జాషువా విజ్ఞాన కేంద్రం ట్రస్టీ పాశం రామారావు ప్రదానం చేశారు. 'జాషువా సాహిత్యం-సామాజిక న్యాయం' అనే అంశంపై చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మన్యూనతతో బతుకుతున్న వారికి జాషువా సాహిత్యం ఆత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాషువా, గురజాడ వంటి వారి అవసరం ఎంతో ఉందని వివరించారు. విఠపు బాలసుబ్రమ్మణ్యం మాట్లాడుతూ.. ప్రపంచంలో బానిసత్వం పేరుతో ఒక విధమైన అణచివేత కొనసాగితే భారత దేశంలో కులం పేరుతో అణచివేత కొనసాగించారన్నారు. కులాన్ని, ఆర్థిక అసమానతలను కలిపి జాషువా తన కవిత్వంలో పేర్కొన్నారన్నారు. నేటి పరిస్థితుల్లో జాషువా సాహిత్యాన్ని గుర్తు చేసుకొని సాంస్కృతిక కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో జాషువా విజ్ఞాన కేంద్రం సెక్రటరీ కాళిదాసు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.