Jun 07,2023 15:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : అంతరాయం లేని మెరుగైన విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ డిబిఎన్‌ పల్లె గ్రామస్తులు బుధవారం ఏపీఎస్పీడీసీఎల్‌ ఎ.డి సురేంద్ర నాథ్‌కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్‌ సమస్యపై డి.బి.ఎన్‌ పల్లె గ్రామస్థులు బుధవారం పెద్ద ఎత్తున ఏడి ఈ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేసి ఎ.డి సురేంద్ర నాథ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామం సబ్‌ స్టేషన్‌కు పక్కనే ఉన్నా నిరంతరం విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత కొంతకాలంగా కోతలు మరింత తీవ్రమయ్యాయని, పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అప్రకటిత కోతలు అధికమయ్యాయని తెలిపారు. గత మూడు రోజులుగా నిద్ర లేని రాత్రిళ్ళు గడిపామని, తమ గ్రామానికి అతి సమీపంలోనే పట్టణ విద్యుత్‌ సరఫరా ఉందని.. అక్కడి నుంచి తమ గ్రామానికి తేలికగా పట్టణ విద్యుత్తు సరఫరా సౌకర్యం కల్పించాలని డి.ఈ, ఏ.డిలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు ఎం.నరసింహులు, టీ.హరికృష్ణ, టీ.పెద్ద నరసింహులు, బి.సుధాకర్‌, నాగభూషణం, వెంకటయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.