Apr 29,2023 10:40
  • కాకినాడలో ఇళ్ల స్థలాల కోసం 58 ఎకరాల ధ్వంసం
  • పునరుద్ధరించాలన్న ఎన్‌జిటి ఆదేశాలు బేఖాతరు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : సముద్ర తీరం కోతకు గురి కాకుండా కాపాడడంలోనూ, ఎన్నో రకాల జలచరాలకు ఆశ్రయం ఇవ్వడంలోనూ, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలోనూ కీలక పాత్ర వహిస్తున్న మడ అడవులకు రక్షణ కరువైంది. కొందరు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, అక్రమార్కుల స్వప్రయోజనాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి వాటి సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సహజంగా ఏర్పడి, విస్తరించిన ఈ మడ అడవులు జిల్లా తీరప్రాంతానికి రక్షణ కవచంలా ఉన్నాయి. వీటిని సంరక్షించాలని, ఎన్‌జిటి ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 2020లో కాకినాడ నగరంలో సుమారు 31 వేల మందికి ఇళ్ల స్థలాల కోసం దుమ్ములపేటలో యాంకరేజ్‌ పోర్టుకు చెందిన 116 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి రూ.16 కోట్లు ఖర్చు చేసి ఈ స్థలాలను చదును చేశారు. అక్కడ మడ భూములున్నాయని, వాటిని ధ్వంసం చేసి మట్టి వేస్తున్నారని పర్యావరణవేత్తలు అప్పట్లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. 2020 మేలోనూ, 2021 జూన్‌లోనూ చెన్నరు నుంచి వచ్చిన ఎన్‌జిటి నిపుణులు శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా చదును చేసిన మొత్తం భూమిలో 58 ఎకరాలను మడ భూములుగా తేల్చారు. నరికేసిన మడ చెట్లను తిరిగి పునరుద్ధరించాలని, మడ భూములను యథాస్థితికి తీసుకురావాలని 2022 సెప్టెంబరు 28న ఎన్‌జిటి ఆదేశాలు ఇచ్చింది. అధికారుల తప్పును ఎత్తి చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఎన్‌జిటి ఆదేశాల మేరకు చదును చేసిన స్థలంలో మొత్తం మట్టిని తొలగించి మడ భూములను యథాస్థితికి తేవాల్సి ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా కప్పి ఉంచిన మట్టిపైనే మొక్కలను నాటారు. దాదాపు పది వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నామంటూ అధికారులు ఎన్‌జిటికి నివేదిక ఇచ్చారు. వాస్తవానికి నాటిన మొక్కల్లో 50 శాతానికిపైగా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. గోదావరి పాయల నుంచి వచ్చే మంచినీరు, సముద్రం నుంచి వచ్చే ఉప్పునీరు సహజ సిద్ధంగా కలిసే చోట మాత్రమే మడ మొక్కలు పెరుగుతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. వేసిన మట్టిని పూర్తిగా తొలగించి సముద్రం, గోదావరి పాయల్లో నీరు ఇక్కడికి వచ్చేలా చేసి మడ మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అధికారులు ఎన్‌జిటి ఆదేశాలను పట్టించుకోవట్లేదని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
 

                                                                        రక్షణ కరువైన కోరంగి

విస్తీర్ణంలో దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులుగా విస్తరించి ఉన్న కోరంగి మడ అడవులకు నానాటికీ రక్షణ కరువవుతోంది. ఈ ప్రాంతాన్ని 1978లోనే వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 332.66 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించగా, 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోరంగి మడ అడవులు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సమీపంలోని ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా వస్తున్న వ్యర్థ నీటిని నేరుగా డ్రెయిన్లలోకి వదులుతున్నారు. ఈ నీరు మడఅడవుల్లోకి చేరడంతో మొక్కలు నాశనం అవుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున నాటు సారా తయారీ జరుగుతోంది. నాటుసారా స్థావరాల ఏర్పాటు కోసం కొందరు అక్రమార్కులు మడ చెట్లను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.
 

                                                            అనధికార ఆక్వా చెరువులతో ముప్పు

అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, రెబ్బనపల్లి, సామంతకుర్రు గ్రామాల తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కొందరు అక్రమార్కులు మడ చెట్లను నరికి అనధికారంగా ఆక్వా చెరువులను తవ్వి ఎక్కడకక్కడ గట్లు వేయడంతో వరద ప్రవాహం సముద్రంలోకి వెళ్లకుండా పొలాలపై ప్రభావం చూపుతోంది. ఈ మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. సుమారు వెయ్యి ఎకరాల్లో సాగుకు అనుమతులు లేవని మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు.