ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని ఈ నెల 25న మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) నాయకులు ప్రకటించారు. శనివారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల నాయకులు కె సుబ్బరావమ్మ, బేబీరాణి, జె లలిత, కె దుర్గ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, దీనిపై విజయవాడ పోలీసు కమిషనర్, డిజిపిని అనుమతి కోరామని వివరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, మినీవర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, టీచర్లకు ఇచ్చేంత వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తోపాటు వివిధ రకాల యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంటు వయసును 62 ఏళ్లకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూఛార్జీలు పెంచాలని, గ్రాస్‌ను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, 2017 నుండి ఇప్పటి వరకూ టిఎ, డిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరిపోయేలా కచ్ఛితమైన కొలతతో ప్రతినెలా 5వ తేదీలోగా సకాలంలో అంగన్‌వాడీ సెంటర్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మూడు సంఘాల ఆధ్వర్యాన విజయవాడలో ధర్నా చౌక్‌లో ధర్నా చేపడతామని తెలిపారు.










