ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతో దళిత, గిరిజన, విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్లకు ముప్పు వాటిళ్లనుందని స్టీల్‌ప్లాంట్ ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండా తౌడన్న, బయ్యే మల్లయ్య అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 976వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ సభ్యులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల వల్లే బడుగు, బలహీన వర్గాల వారు కొంతైనా గౌరవప్రదంగా జీవిస్తున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీక్షల ప్రారంభానికి ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వైటి.దాస్, వరసాల శ్రీనివాసరావు, శ్రీనివాసరాజు, కెవి.రత్నం, గణేష్, వేణుగోపాల్, బిడి.నాయక్ పాల్గొన్నారు.










