- 7.31 లక్షల మందిలో 25 వేల మందికే విత్తనాలు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : రైతులకు పూర్తి స్థాయిలో రాయితీ విత్తనాలు అందిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 7.31 లక్షల మంది రైతులు ఉండగా అందులో 25 వేల మందికి మాత్రమే రాయితీ విత్తనాలు అందాయి. మిగితా రైతులు అధిక ధర వెచ్చించి బహిరంగ మార్కెటులో కొనుగోలు చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాకు వేరుశనగ, కందులు, జీలుగ, పిల్లి పెసర, కొర్రలు, పెసలు అన్ని విత్తనాలు కలిపి 91,970 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరమని జిల్లా అధికారులు వ్యవసాయ శాఖకు ప్రతిపాదనలు పంపగా 35,087 క్వింటాళ్లు కేటాయించారు. అందులో కర్నూలు జిల్లాకు 13,334 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 7,124 కలిపి మొత్తంగా 20,458 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు కేవలం 25 వేల మంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. నాణ్యత లేకపోవడం, పంపిణీపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో 15 వేల క్వింటాళ్లు గొడౌన్లకే పరిమితమయ్యాయి. ఏడు లక్షల మందిలో సగటున నాలుగు లక్షల మంది రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి జిల్లా ఖరీఫ్ సీజన్లో 21వేల క్వింటాళ్ల వేరుశనగ రాయితీ విత్తనాలను పంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించగా ఎపి సీడ్స్ నుంచి ఆర్‌బికెల ద్వారా 16,100 క్వింటాళ్ల రాయితీ విత్తనం రైతుకు అందింది. కర్నూలు జిల్లాలో 850 క్వింటాళ్లు రాయితీపై అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 14 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. మినుములు 13 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క క్వింటా కూడా ఇవ్వలేదు. పెసలు మూడు క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉండగా అసలు పంపిణికే నోచుకోలేదు. కొర్రలు 98 క్వింటాళ్లకు గాను రెండు క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. పిల్లి పెసర 107 క్వింటాళ్లకు 18 క్వింటాళ్లను రాయితీపై అందించారు.
వాణిజ్య పంటలు అంతంత మాత్రమే
వాణిజ్య పంటలైన పత్తి , మిరప, ఉల్లి, మొక్కజొన్న తదితర విత్తనాల పంపిణీ కూడా అంతంత మాత్రమే ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంఒయు కుదుర్చుకున్నప్పటికీ సకాలంలో రైతులకు అందించలేక పోయింది. రెండు జిల్లాల పరిధిలో సుమారు 7.5 లక్షల ఎకరాల్తో పత్తి సాగవుతుంది. అందుకు 22 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 835 ప్యాకెట్ల పత్తి విత్తనాలను, 110 మిరప, 45 క్వింటాళ్ల సోయాబీన్, 279 ప్యాకెట్ల కాకర విత్తనాలు మాత్రమే అందించారు. వాణిజ్య పంటల విత్తనాలను ఎమ్మార్పీ ధరలకు ఆర్‌బికెలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసి రూ.20 కోట్ల మేర రైతులు నష్టపోయారు.










