Mar 10,2023 17:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్స్‌ 6,100 పోస్టుల నియామకాలకు సంబంధించి ఈ నెల 14 నుంచి జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 13 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలతోపాటు శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ మనీష్‌కుమార్‌ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్‌, ఎపిఎస్‌పి విభాగం కలిపి మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, అందులో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. వీరికి ఈ నెల 14 నుంచి జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేశారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. శాసన మండలి ఎన్నికల రోజైన ఈ నెల 13న జరగనున్న ఎస్‌సిటి కానిస్టేబుల్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లను వాయిదావేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరగాల్సిన టెస్ట్‌ మినహా మిగతా టెస్ట్‌లను వాయిదావేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.