- నిత్యావసరాలూ అందించని సర్కారు
- సాయం కోసం విలీన మండలాల ప్రజల ఎదురుచూపు
ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. వరుస వరదలతో వారంతా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ సాయం అందడం లేదు. దీంతో, బాధితులు ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు, తగిన ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన చింతూరు, విఆర్.పురం, కూనవరం, ఎటపాక ఈ ఏడాది జులై, ఆగస్టుల్లో వచ్చిన వరదల్లో అతలాకుతలమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత నెల 9 నుంచి 20 వరకూ మొదటి దశ వరద ప్రజలకు తీవ్రంగా నష్టం చేకూర్చింది. వరద తగ్గిన తరువాత ఇళ్లను శుభ్రపరుచుకుని కుదురుకుంటున్న సమయంలోనే ఈ నెల పదో తేదీ నుంచి మళ్లీ గోదావరి, శబరి నదులు ఉప్పొంగి ప్రజలను నిలువునా ముంచేశాయి. మొదటి, రెండో దశ వరదలకు ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో రోజుల తరబడి చిక్కుకున్నాయి. ముంపు తగ్గాక ఎక్కడ చూసినా కూలిన ఇళ్లు, గోడలు, పాడైపోయిన రహదారులు, ఇళ్లు, వీధుల నిండా బురద, మరమ్మతులకు గురైన వాహనాలు ఇవే కానవచ్చాయి. మొదటి దశ వరదల సమయంలో ప్రభుత్వం రూ.2 వేలు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందజేసింది. రెండోసారి ఈ నెలలో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదని చింతూరు మండలంలోని ఎజి కోడేరు, ముకునూరు, మల్లెతోట, కల్లేరు, కొయుగూరు గ్రామస్తులు 'ప్రజాశక్తి'కి తెలిపారు. ఈ నెల తొమ్మిదో తేదీకే విలీన మండలాలు ప్రజలు కొండలు, గుట్టలుపైకి వెళ్లిపోయారు. అక్కడే తాత్కాలిక టెంట్లు వేసుకున్నారు. కనీసం అధికారులు బోట్ల సాయంతో నిత్యాసరాలు కూడా అందించలేదని వారంతా చెబుతున్నారు. కిరోసిన్, కొవ్వొత్తులు, టార్ఫాలిన్లు అందించలేదని వాపోయారు. తాగునీరు కలుషితం కావడంతో అనారోగ్యాల పాలవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రెండు రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, కూలిన ఇళ్లకు రూ.6 లక్షల నష్టపరిహారం అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూరు 41.15లో తమను చేర్చి పునరావాసం, పరిహారం అమలు చేయాలని కోరుతున్నారు. ఎటపాక మండలంలో నందిగామ, మురుమూరు, గన్నవరం, నెల్లిపాక, రాయనిపేట నేటికీ ముంపులోనే ఉన్నాయి. ఇక్కడా ఎటువంటి సాయమూ అందలేదు. నిత్యావసర సరుకుల కోసం భద్రాచలానికి పడవల్లో వెళుతున్నారు. ఈ మండలంలో గ్రామాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం 11 పడవలను ఏర్పాటు చేసింది. వీటిని ఉచితంగా నడపాల్సి ఉన్నా, బోటు నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.

నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడ్డాం
వారం రోజులుగా మా గ్రామం ముంపులోనే ఉంది. నిత్యావసర వస్తువులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. ఏది దొరికితే అదే తిన్నాం. శనివారం కాసింత వరద తగ్గడంతో మా గ్రామం నుంచి పడవపై చింతూరు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాను. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. వరదతో పంట మొత్తం నీట మునిగింది. తీవ్రంగా నష్టపోయాను. ఆర్థికంగా నష్టపోయిన నాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి
-ధర్మల బుచ్చయ్య, కొయుగురు,

చింతూరు మండలం పది రోజులుగా లారీలోనే ఉన్నా
నేను హైదరాబాద్ నుంచి నాపరాళ్ల లోడ్‌ను లారీపై తీసుకొస్తుండగా వరద చుట్టుముట్టింది. పది రోజులుగా లారీలోనే ఉన్నాను. దారి ఖర్చులకు తెచ్చిన డబ్బులు అయిపోయాయి. బట్టలు లేవు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాతోపాటు మరో 50 మంది లారీ డ్రైవర్లు రోడ్డుపైనే నిలిచిపోయారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు.
-సిహెచ్.శివ, లారీ డ్రైవర్,
మంచిల్లి గ్రామం










