Jul 31,2022 09:02
  • ఏడాదైనా ముందుకు సాగని 'అన్నమయ్య' రక్షణ గోడ
  • వాస్తు పేరుతో నివాస స్థలం ఎంపికలో మీనమేషాలు

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ఏడాదైనా అన్నమయ్య రిజర్వాయర్‌ వరద బాధితులు ప్రభుత్వ హామీలకు నోచుకోలేదు. దాతలు నిర్మించిన రేకుల షెడ్డులోనే నేటికీ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు వరద వస్తోందో తెలియక బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి బహుదా నదికి గతేడాది నవంబర్‌ 19న వరదలు పోటెత్తడంతో అన్నమయ్య రిజర్వాయర్‌ కట్టలు తెగి 25 గ్రామాలు నీట మునిగిపోయాయి. ప్రధానంగా పులపత్తూరు, మందపల్లి, రామచంద్రాపురం, గుండ్లూరు, శేషమాంబపురం, తొగూరుపేట గ్రామస్తులు సర్వస్వం కోల్పోయారు. అన్నమయ్య రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతాల్లో ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మిస్తామని సిఎం తన పర్యటనలో భరోసా ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు, ఇసుక మేటలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
 

                                                                   500 ఎకరాల్లో ఇసుక కుప్పలు

పులపుత్తూరు, మందపల్లి గ్రామాలకు మూడు లేఅవుట్లలో 446 ఇళ్లకు స్థలాన్ని ఎంపిక చేశారు. మొదటి లే అవుట్‌ 301 ఇళ్ల స్థలాలకు వాస్తుదోషం పేరుతో రెండు సామాజిక తరగతులు ససేమిరా అనడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అన్నమయ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో 855 నుంచి 1000 ఎకరాల్లో ఇసుక మేటలు, వరద వ్యర్ధాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించేందుకు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ వరద బాధితులు పలుమార్లు తిరగడంతో జెసిబిల సహాయంతో ఇసుక మేటలను కుప్పలుగా పోశారు. అయితే ఇసుకను తరలించడానికి ఉద్దేశించిన ట్రక్కుల పర్యవేక్షణ కొరవడడంతో సుమారు 500 ఎకరాల్లో ఇసుక కుప్పలు దర్శనమిస్తున్నాయి. పంటల సాగు ప్రశ్నార్థకంగా మారడంతో బతుకు దెరువు కోసం కొందరు గ్రామాలను వదిలి రాజంపేట, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, తిరుపతి వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది అదృశ్యమైన మందపల్లి గ్రామానికి చెందిన కొర్రపాటి సుబ్బమ్మకు ఇచ్చిన ఉద్యోగ హామీ అమలుకు నోచుకోలేదు.

33