Jul 11,2023 22:25

సెమీస్‌కు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు
వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఒకేరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోటీల్లో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌, 4వ సీడ్‌ పెగుల అన్‌సీడెడ్‌ క్రీడాకారిణుల చేతిలో ఓటమిపాలయ్యారు. స్వైటెక్‌ ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్వీటోలినా చేతిలో, పెగుల చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మార్కెట వోండ్రుసోవా చేతిలో పరాజయాన్ని చవిచూశారు. వోండ్రుసోవా, స్విటోలినా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌కు చేరడం ఇదే ప్రథమం. వోండ్రుసోవా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉండగా.. స్విటోలీనా మహిళల సింగిల్స్‌లో 76వ ర్యాంక్‌ క్రీడాకారిణి. తొలి క్వార్టర్‌ఫైనల్లో వోండ్రుసోవా 6-4, 2-6, 6-4తో 4వ సీడ్‌, అమెరికాకు చెందిన జెస్సికా పెగూలపై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన వోండ్రుసోవా.. రెండో సెట్‌ను చేజార్చుకుంది. మూడోసెట్‌లోనూ ఓ దశలో 1-4తో వెనుకబడ్డ వోండ్రుసోవా.. ఆ తర్వాత ప్రత్యర్ధికి ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా ఆ సెట్‌ను 6-4తో చేజిక్కించుకొని విజయం సాధించడం విశేషం.
స్వైటెక్‌ చెమటోడ్చినా..
మరో క్వార్టర్‌ఫైనల్లో ఇగా స్వైటెక్‌ పోరాడినా ప్రయోజనం లేకపోయింది. హోరాహోరీసాగి సాగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో స్వైటెక్‌ 5-7, 7-6(7-5), 2-6తో అన్‌సీడెడ్‌ స్విటోలీనా(ఉక్రెయిన్‌)పై పోరాడి ఓడింది. తొలి సెట్‌ను 5-7తో చేజార్చుకున్న స్వైటెక్‌ రెండో సెట్‌నూ టై బ్రేక్‌ వరకు పోరాడింది. టై బ్రేక్‌లో ఓ దశలో 1-4పాయింట్లతో వెనుకబడ్డ స్వైటెక్‌.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని 7-5పాయింట్లతో ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఇరువురు ఒక్కో సెట్‌ను కైవసం చేసుకోగా.. నిర్ణయాత్మక మూడోసెట్‌లో స్విటోలినా అద్భుతంగా పుంజుకొని స్వైటెక్‌పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.