Dec 11,2022 21:32

ఢిల్లీ: సాధారణంగా కంపెనీలు తమ వద్ద అధిక నగదు ప్రవాహం ఉన్నప్పుడు బైబ్యాక్‌ కు వెళుతుంటాయి. లేదా స్టాక్‌ ధర అంతర్గత విలువ కంటే దిగువకు చేరినప్పుడు కంపెనీలు తమ షేర్లను తామే కొనుగోలు చేస్తుంటాయి. ప్రస్తుతం పేటీఎం రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్‌ నిర్ణయం సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఐపీఓ నిధులను మాత్రం అందుకు వినియోగించొద్దని తెలిపారు.
షేర్ల బైబ్యాక్‌ కోసం పేటీఎం మాతఅసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ డిసెంబరు 13న భేటీ కానుంది. అయితే, ఐపీఓలో సమీకరించిన నిధులతో పేటీఎం తమ సొంత షేర్లను కొనుగోలు చేయడం కుదరదని నిపుణులు తెలిపారు. అందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. అలాంటప్పుడు పేటీఎం తమ వద్ద ఉన్న ద్రవ్యలభ్యతను బైబ్యాక్‌ కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు. తమ వద్ద రూ.9,182 కోట్ల ద్రవ్యలభ్యత ఉందని ఇటీవలి త్రైమాసిక నివేదికలో పేటీఎం తెలిపింది.
అనేక అంచనాల మధ్య ఐపీఓకి వచ్చిన పేటీఎం .. స్టాక్‌ మార్కెట్ల ముందు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. 2022లో ఇప్పటి వరకు ఈ స్టాక్‌ 60 శాతం నష్టపోయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తతరం టెక్‌ కంపెనీ షేర్లలో అమ్మకాలు, సంస్థ లాభదాయకతపై అనుమానాలే ఈ స్టాక్‌ కొంపముంచాయి. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం నింపడం కోసం షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనతో పేటీఎం ముందుకొచ్చింది. ఇందుకోసం ఐపీఓలో సమీకరించిన నిధుల్ని ఉపయోగించుకోనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలా చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కంపెనీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.