- 2023లో 5.9 శాతమే వృద్థి
- గోల్డ్‌మాన్ సాక్స్ అంచనా
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు మందగిస్తుందని అంతర్జాతీయ విత్త సేవల సంస్థ గోల్డ్‌మాన్ సాక్స్ గ్రూపు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి కోలుకున్నప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని.. అవి వృద్థి రేటుకు ప్రతిబంధకంగా మారాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2023 వృద్థి రేటు మరింత మందగించి 5.9 శాతానికే పడిపోవచ్చని అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, తగ్గిన వినియోగ డిమాండ్ వంటి సవాళ్ల వల్ల ప్రస్తుత ఏడాది భారత జిడిపి 6.9 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో వృద్థి రేటు మరింత నెమ్మదించనుందని తెలిపింది. వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో వేగంగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థలో.. ఈ ఏడాది ఆ ఉత్సాహం కానరావడం లేదని గోల్డ్‌మాన్ సాక్స్ పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.










