Jul 05,2023 18:03

న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు జూలై 5వ తేదీన 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1995 జూలై 5న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పి.వి రమణ, విజయలిద్దరూ వాలీబాల్‌ క్రీడాకారులైనప్పటికీ.. తాను మాత్రం ప్రముఖ బ్యాడ్మింటన్‌ పుల్లెల గోపీచంద్‌ స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ను ఎంచుకుంది. 2011లో క్రీడా రంగంలో అరంగేట్రం చేసిన ఆమె ఎన్నో పతకాలను సాధించిపెట్టింది. భారత్‌లో క్రీడల్లో రాణిస్తున్న అగ్రగామి మహిళల పేరుల్లో పి.వి సింధు పేరు కూడా చేరింది.
పతకాల వారీగా చూస్తే.. ఆమె రెండు ఒలింపిక్స్‌ పతకాలను సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాదించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలు కూడా సింధునే కావడం విశేషం.

  • సింధు సాధించిన పతకాలు..

- బాసెల్‌లో జరిగిన 2019 ఈవెంట్‌లో ఆమె బంగారం పతకం కైవసం చేసుకుంది.
- 2017, 2018 ఈవెంట్‌లలో రజత పతకాలను, 2013, 2014 ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకుంది. దీంతో ఆమె చాంపియన్‌షిప్‌లలో ఐదుసార్లు పతక విజేతగా నిలిచింది.
- 2022 బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2018 గోల్డ్‌ కోస్ట్‌ నగరంలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ ఈమ్‌ ఈవెంట్‌ను గెలుచుకుంది
- 2018 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌లో మహిళల సింగిల్స్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది. 2022 జరిగిన కామన్వెల్త్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజిత పతకాన్ని కూడా సాధించింది.
- సింధు రెండు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించింది. 2018లో జకర్తాలో జరిగిన ఈవెంట్‌లో రజత పతకం, 2014 ఇంచియాన్‌లో జరిగిన ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.
- బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బిడబ్య్లుఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో 2017లోనే సింధు రెండవ స్థానంలో నిలిచింది.
- ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళల టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఉబెర్‌ కప్‌లో సింధు రెండు కాంస్య పతకాలను సాధించారు.
- సింధు ఈ పతకాలతోపాటు స్విస్‌ ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌, సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ మొదలైన అనేక బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బిడబ్య్లుఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ టైటిళ్లను కూడా గెలుచుకుంది.