ముంబయి: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో ఆటగాళ్లు ఒత్తిడిని జయించడం నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, చివరి వన్డేలో ఓటమికి ఒత్తిడే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. సరైన మిడిలార్డర్ బ్యాటర్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడితే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేలో తొలి బంతికే ఔటవ్వడం, మరో నాణ్యమైన మిడిలార్డర్ బ్యాటర్ జట్టులో లేకపోవడంతో సిరీస్‌ను చేజార్చుకున్నామన్నాడు. ఈ క్రమంలో ఈ నెలాఖరునుంచి ప్రారంభమయ్యే ఐపిఎల్‌లో ఆటగాళ్లంతా పనిభారాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకొని వన్డే ప్రపంచకప్‌కు సిద్ధం కావాలని చెప్పుకొచ్చాడు. అక్టోబర్‌లో భారత్ వేదికగా ఐసిసి వన్డే ప్రపంచకప్ జరగనుందని, భారత్ సింగిల్‌గా టోర్నీకి ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారన్నాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్చుకోవాలన్నాడు. మూడో వన్డేలో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగ్గదేనని, ఆల్‌రౌండర్లు ముగ్గురున్నా.. నాణ్యమైన మిడిలార్డర్ బ్యాటర్ లేకపోయాడన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ లేని లోటు స్పష్టంగా కనబడిందని, రాబోయే టోర్నీల్లో మరింత మెరుగైన ప్రదర్శనను కనబరుస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.










