Oct 27,2022 20:47
  • ఆర్థిక వ్యవస్థల మందగింపు ఎఫెక్ట్‌
  • గ్యాస్‌, బొగ్గు ధరలు రెట్టింపు
  • ప్రపంచ బ్యాంక్‌ అంచనా

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చే రెండేళ్లలో చమురు ధరలు తగ్గొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. అయితే గత ఐదేళ్ల సగటు ధరతో పోలిస్తే మాత్రం అధికంగానే ఉంటాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్న నేపథ్యంలో ఇంధన రంగానికి డిమాండ్‌ తగ్గొచ్చని అంచనా వేసింది. ''ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తల మూలంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక చమురు ధరల వల్ల ఆహారధాన్యాలు, వంటనూనెల రేట్లు పెరుగుతాయి. ప్రతికూల వాతావరణం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సైతం తగ్గుతాయి. చాలా దేశాల కరెన్సీల విలువ క్షీణించిన నేపథ్యంలో ధరలు తగ్గినప్పటికీ దిగుమతులు భారంగా మారనున్నాయి. ఈ క్రమంలో ఆహార, ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించడంతోనే చమురు ధరలు దిగిరానున్నాయి.'' అని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది.
వచ్చే ఏడాది 2023లో చమురు ధరలు 11 శాతం, 2024లో 12 శాతం చొప్పున తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 2023లో 92 డాలర్లుగా, 2024లో 80 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ కావొచ్చని అంచనా వేసింది. గత ఐదేళ్ల సగటు ధర 60 డాలర్లతో పోలిస్తే 30 డాలర్లు ఎక్కువేనని తెలిపింది. సహజ వాయువు, బొగ్గు ధరలు సైతం 2023లో తగ్గొచ్చని పేర్కొంది. అయినప్పటికీ.. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే మాత్రం ధరలు రెండింతలకు పైనే ఉంటాయని చెప్పింది. ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో వర్థమాన మార్కెట్లు, అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు పలు పరిమితులు కలిగి ఉన్నాయని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.