Sep 28,2023 21:35

- జిపిఎస్‌ బిల్లు ప్రతులు దగ్ధం
ప్రజాశక్తి-యంత్రాంగం:ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు గురువారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన జిపిఎస్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల అధికారం తరువాత జిపిఎస్‌ను తీసుకొచ్చి ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఎపి సిపిఎస్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిపిఎస్‌ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పాత పెన్షన్‌ ఇస్తామన్న హామీని నమ్మి అధికారం ఇచ్చినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ చెప్పులతో కొట్టుకున్నారు. అనంతపురం టవర్‌క్లాక్‌ సర్కిల్‌లో జిపిఎస్‌ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ పాఠశాల ఆవరణలో, కడప యుటిఎఫ్‌ భవన్‌ ఎదుట, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జిపిఎస్‌ ప్రతులను దగ్ధం చేశారు.