- 19న విశాఖలో భారత్, ఆసీస్ రెండో వన్డే మ్యాచ్
ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ, పిఎం.పాలెం (విశాఖపట్నం) : విశాఖలోని ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19న భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆఫ్‌లైన్ టికెట్లను పిఎం.పాలెంలోని ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియం - బి గ్రౌండ్, జివిఎంసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద విక్రయించారు. రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.3500, రూ.6 వేలు ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. అమ్మకాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రూ.600 టికెట్లు పూర్తయ్యాయి. టికెట్ల కోసం భారీ సంఖ్యలో తరలి వచ్చిన క్రికెట్ అభిమానులు అర్ధరాత్రి 2 గంటల నుండి క్యూ లైన్‌లో నిల్చున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు రోజులపాటు ఆన్‌లైన్ ద్వారా సుమారు 60 శాతం మేర టికెట్ల అమ్మకాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో పేటీఎం ఇన్‌సైడర్ యాప్ ద్వారా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బార్ కోడ్‌లతో కూడిన టికెట్లను అందించనున్నారు. మ్యాచ్ జరిగే రోజు బార్ కోడ్ కలిగిన టికెట్లు ఉన్నవారినే స్టేడియం లోపలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఎసిఎ సిఇఒ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దామని తెలిపారు. వీక్షకులకు అన్ని సౌకర్యాలూ కల్పించామని వెల్లడించారు.










