- జిపిఎస్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జిపిఎస్ అనేది గ్యారెంటీ లేని పెన్షన్ విధానమని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్యారంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్)ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని, పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) అమలు చేయాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. జిపిఎస్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసినట్లు వచ్చిన వార్తలను వ్యతిరేకిస్తున్నామని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిపిఎస్ అనేది సిపిఎస్‌కు మరో ప్రతిరూపం తప్ప దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. పదేపదే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం మొండిగా జిపిఎస్‌ను అమలు చేయడానికే సిద్ధపడటం అభ్యంతరకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మనోభావాలను పెడచెవిన పెట్టి జిపిఎస్ అమలుకు పూనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిపిఎస్ అమలు కోసం తొందరపడుతున్న ప్రభుత్వం 2004 సెప్టెంబరు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన 11,000 మందిని కేంద్ర ప్రభుత్వ జిఓ ప్రకారం ఒపిఎస్‌లోకి ఎందుకు తీసుకురావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగా వారందరినీ ఒపిఎస్ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అసంతృప్తిని గమనించి ప్రభుత్వం ఒపిఎస్ అమలు చేయకపోతే త్వరలో ఇతర సంఘాలను కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జిపిఎస్‌ను మంత్రి మండలి ఆమోదించటం ఉద్యోగులను మోసం చేయడమేనని ఎస్‌టియు విమర్శించింది. ఏళ్ల తరబడి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేశాయని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, హెచ్ తిమ్మన్న పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భద్రత లేని, ఆమోదం లేని జిపిఎస్‌ను కేబినెట్ ఆమోదించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి తెలిపారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాతపెన్షన్ అమలు కోసం ఏళ్లతరబడి జరిపిన పోరాటం జిపిఎస్‌గా రూపాంతరం చెందడం ఆమోదయోగ్యం కాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నరహరి, ఎన్‌వి రమణయ్య పేర్కొన్నారు. ఒపిఎస్‌ను మాత్రమే పునరుద్ధరించాలని, జిపిఎస్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయులు అంగీకరించటం లేదని ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎజిఎస్ గణపతిరావు, కె ప్రకాష్‌రావు తెలిపారు. జిపిఎస్ బిల్లుతో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎపిసిపిఎస్‌ఇఎ అసోసియేట్ ప్రెసిడెంట్ సిఎం దాస్ విమర్శించారు.










