Jul 30,2022 07:45
  • వరదపోటుతో మత్స్యకారుల బతుకు ఛిద్రం
  • సాయం కోసం ఎదురుచూపులు
     

ప్రజాశక్తి - మామిడికుదురు( డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : గోదావరి వరద పోటుతో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి ఛిద్రంగా మారింది. నెల రోజులుగా వేట లేక, పూట గడవక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల వరద తగ్గుముఖం పట్టినా.. వారికి నేటికీ పూర్తి స్థాయిలో ఉపాధి లేదు. కోనసీమ జిల్లాలో వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు ప్రవహిస్తున్నాయి. నదీతీర ప్రాంతాల్లో 80 వేల వరకు మత్స్యకార కుటుంబాలు నదిలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. జులైలోనే మత్స్యకారులకు కాసుల పంట పండుతుంది. గోదావరికి ఎర్రనీరు తగలడంతో పులసల వేటలో వీరు నిమగమవుతారు. గ్రూపులుగా ఏర్పడి పులస వేట సాగిస్తుంటారు. జులై మొదటి వారం నుంచే గోదావరి ఉధృతి ప్రారంభం కావడంతో నదిలో చేపల వేటను అధికారులు నిషేధించారు. దీంతో, సాధారణ వేటకు సైతం వీరు దూరమయ్యారు.
 

                                                                 ముంపులో ఇళ్లు, వేట సామగ్రి

జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఆత్రేయపురం, కె.గంగవరం మండలాల్లో మత్స్యకారుల గృహాలు నదీ తీరం వెంబడి, లంకల్లోనే ఉన్నాయి. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే సరికే వీరి గృహాలు ముంపు బారిన పడతాయి. రెండు రోజుల్లో ముంపు వీడితే యథావిధిగా వీరు పనులు చేసుకునేవారు. ఈ సారి 20 రోజులకుపైగా మత్స్యకారుల గృహాలు ముంపునకు గురయ్యాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి మండలాల్లో వీరి గృహాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద తాకిడికి 15 గృహాలు కూలిపోగా, మరో 250కిపైగా పూరి గుడిసెలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వలలు ధ్వంసమయ్యాయి. ఒక్కో వల కనిష్టంగా రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టం వాటిల్లిందని గెదెల్లంక మత్స్యకారులు వాపోయారు.
 

                                                                               అందని సాయం

20 రోజులుగా ముంపులో ఉన్నా 25 కిలోల బియ్యం, కిలో పప్పు, నూనె ప్యాకెట్‌, పంచదార, కూరగాయలు తప్ప ఇతర ఎలాంటి సాయం అందలేదని మత్స్యకారులు చెప్పారు. కుటుంబానికి రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని, కూరగాయలు రెండు రోజులకే అయిపోయిందని, వారిచ్చిన ఆర్థిక సాయం ఏ మూలకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను బాగుచేసుకునేందుకు చిల్లి గవ్వ లేదని, వలలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

55