న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన తమ ఏ ఉద్యోగిని కూడా రాజీనామా చేయాలని అమెజాన్ ఒత్తిడి చేయలేదని ఆ కంపెనీ పేర్కొంది. అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపులపై కేంద్ర కార్మిక జారీ చేసిన నోటీసులపై ఆ కంపెనీ శుక్రవారం స్పందించింది. అమెజాన్ భారత చట్టాల్ని ఉల్లంఘిస్తుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్‌ఐటిఇఎస్) ఆరోపించింది. అదే విధంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలన్న ఆదేశాలపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై బెంగళూరులోని కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ ముందు అమెజాన్ ప్రతినిధి నేరుగా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తొలగింపులపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై అమెజాన్ స్పందిస్తూ.. తాము రాజీనామా చేయాలని ఎవరినీ ఒత్తిడి చేయలేదని.. స్వచ్ఛందంగా వైదొలిగితే నష్ట పరిహారం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా చెప్పామని పేర్కొంది. నవంబర్ 30 కల్లా తాము చెప్పిన ఉద్యోగులు రాజీనామా చేయాలని అమెజాన్ ఆదేశాలు జారీ చేసినట్లు ఇటీవల పలు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.










