May 03,2023 21:21
  • తొలిరౌండ్‌లో 8వ సీడ్‌పై గెలుపు
  • ప్రపంచ బ్యాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

తస్కెంట్‌(ఉబ్జెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2023 రెండోరౌండ్‌లోకి నిషాంత్‌ దేవ్‌ ప్రవేశించాడు. బుధవారం జరిగిన 71కిలోల విభాగం తొలిరౌండ్‌ పోటీలో నిషాంత్‌ 5-0పాయింట్ల తేడాతో అజర్‌బైజాన్‌కు చెంఇన 8వ సీడ్‌ సర్కాన్‌ అలియోవ్‌పై సంచలన విజయం సాధించాడు. నిషాంత్‌ ఎడమచేతి పంచ్‌లతో ప్రత్యర్ధిపై పిడిగిద్దులు ఝుళిపించాడు. తొలి రెండు రౌండ్‌లు పూర్తయ్యేసరికి 4-1, ఆ తర్వాత 5-0 ఆధిక్యతలో నిలిచిన నిషాంత్‌ ఆ తర్వాత రౌండ్‌లోనూ తన ఆధిక్యతను నిలుపకుంటూ చివరిరౌండ్‌ 3నిమిషాల పోటీలోనూ 5-0తో ఆధిక్యతను సంపాదించి మ్యాచ్‌ను ముగించాడు. రెండుసార్లు జాతీయ ఛాంపియన్‌, 2021 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన 22వ నిషాంత్‌ రెండోరౌండ్‌లో 2021 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత, కొరియాకు చెందిన సంగ్‌మిన్‌ లీతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక గోవింద్‌(48కిలోలు), దీపక్‌ భోరియా(51), శివ థాపా(63.5), నరేంద్ర బెర్వాల్‌(+92) గురువారం తొలిరౌండ్‌ బౌట్‌లలో పాల్గొననున్నారు. ఈ టోర్నమెంట్‌లో 13మందితో కూడిన భారత బాక్సర్ల బృందం పాల్గొంటోంది.