దుబాయ్: టాప్-4లో చోటు దక్కించుకోవడమే తమ తదుపరి లక్ష్యమని ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ ఛాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అన్నారు. ఫైనల్లో విజయం సాధించిన అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ.. టాప్-4 ర్యాంక్‌లో నిలవడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని, రాబోయే టోర్నమెంట్‌లలోనూ రాణించిన ఒలింపిక్స్ బెర్త్ సాధించడమే తదుపరి లక్ష్యమని చెప్పుకొచ్చారు. సాత్విక్ సాయిరాజ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అయినా ఈ టోర్నమెంట్‌లో ఆ సవాళ్లనన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచేందుకు కృషిచేశాడని చిరాగ్ శెట్టి తెలుపగా.. తామిద్దరి మధ్య మంచి అవగాహన ఉందని, చిరాగ్ శెట్టి మంచి భాగస్వామి అని సాత్విక్ సాయిరాజ్ అన్నాడు. తన గాయాల కారణంగానే గతంలో కొన్ని టోర్నమెంట్లు ఓడిపోయామని, అయినా చిరాగ్ శెట్టి భాగస్వామి మార్పును కోరుకోలేదని, రాబోయే టోర్నీల్లోనూ రాణించి ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తామని తెలిపాడు. అలాగే కోచ్ మథియాస్ బారుకు వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిజియో స్పెషలిస్ట్‌తోపాటు, మొత్తం సహాయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదలు తెలియజేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇక కోచ్ మథియాస్ మాట్లాడుతూ.. టైటిల్ విజేతగా నిలిచే క్రమంలో రెండు, మూడు గేమ్‌లలో ఓ దశలో వీరు వెనుకబడ్డారని, అయినా ఏమాత్రం నిగ్రహం కోల్పోకుండా వీరిద్దరూ పుంజుకున్న తీరు అమోఘమైందని వెల్లడించారు. ఒలింపిక్ బెర్త్ సాధించేంత వరకు వీరిద్దరూ సేఫ్ జోన్‌లో లేనట్లేనని, మొదటి నాలుగు స్థానాల్లో నిలవడమే వారి తదుపరి లక్ష్యం అయినా.. టాప్-16లో నిలకడగా చోటు దక్కించుకోవడం శుభ పరిణామమని కోచ్ తెలిపారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వజం 16-21, 21-17, 21-19తో ఎనిమిదో సీడ్ ఆంగ్ యే సిన్-టోరు యీ(మలేషియా) జంటపై గెలుపొంది స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి గేమ్ కోల్పోయిన భారత షట్లర్లు ఆ తర్వాత విజృంభించి వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేశారు. ఆసియా చాంపియన్‌షిప్ డబుల్స్‌లో భారత్ నుంచి చివరిసారిగా దీపు ఘోష్-రమన్ ఘోష్ జంట 1971లో కాంస్యం నెగ్గింది. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భారత జోడీ డబుల్స్‌లో పతకం పట్టింది. ఈ ఏడాది అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తూ.. మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేసింది. పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా గతంలో దినేశ్ ఖన్నా 1965లో నిలిచాడు.










