వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు చివరి బంతికి బై రన్ రావడంతో గెలిచింది. వెలుతురు లేమితో ఆలస్యంతో చివరిరోజు ఆట ప్రారంభం కాగా.. 70 ఓవర్లలో 285పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఈ క్రమంలో 61 ఓవర్లు పూర్తయ్యేసరికి 3వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ధాటిగా ఆడే క్రమంలో 66 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 253 చేసింది. ఇదే క్రమంలో 69ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు కోల్పోయి 277పరుగులు కొట్టినా.. ఆఖరి 6 బంత్లుఓ్ల విజయానికి 8పరుగులు చేయాల్సి వచ్చింది. ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ రాగా.. మూడో బంతికి హెన్రీ రనౌటయ్యాడు. నాల్గో బంతిని విలియమ్సన్ ఫోర్ కొట్టగా.. ఐదో బంతికి పరుగులేమీ రాలేదు.. ఆరో బంతికి విలియమ్సన్ బైస్ రూపంలో ఒక పరుగు తీయడంతో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో శ్రీలంక డబ్ల్యుటిసి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిఛెల్‌కు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ 17నుంచి ప్రారంభం కానుంది.











