Jun 21,2023 22:20

న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగ దినోత్సవం (జూన్‌ 21) సందర్భంగా ప్రధాని మోడీ భారత ప్రజలనుద్దేశించి వీడియో సందేశాన్నందించారు. ఈ సందర్బంగా 'భారతీయులు కొత్త ఆలోచనలను స్వాగతించారని, వాటిని సంరక్షించి దేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని కీర్తించారు' అని ఆయన అన్నారు. అలాగే 'యోగా ద్వారా మన వైరుధ్యాలు, అడ్డంకులు, ప్రతిఘటనలు తొలగించుకోవాలి. ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ స్ఫూర్తిని ప్రపంచానికి ఉదాహరణగా చూపాలి' అని మోడీ అన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌లో బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జాతీయ వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ నాయకత్వం వహించారు. పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో జరిగిన యోగా వేడుకల్లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. అలాగే వివిధ నగరాల్లో జరిగిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రులు పాల్గొని యోగా వ్యాయామాలు చేశారు.
కాగా, మోడీ ప్రస్తుతం అమెరికా అధికారిక పర్యటనలో ఉన్నారు. బుధవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీతోపాటు ఆర్కిటిక్‌, అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రాల పరిశోధకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు.