Mar 20,2023 09:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : క్యాన్సర్‌ చికిత్సపై ప్రజలు అవగాహనను పెంచుకోవాలని మెడికల్‌ అంకాలజిస్ట్‌, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ జి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో కొలరెక్టల్‌ క్యాన్సర్‌కు సంబంధించి అధునాతన చికిత్సా విధానాలపై అవగాహన కార్యక్రమం (సిఎంఇ) జరిగింది. ప్రజల్లో కొలరెక్టల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన అంకాలజిస్ట్‌లు దాదాపు 500 మంది హాజరై చికిత్సా విధానంలో రొబోటిక్‌, ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీల పాత్రపై మాట్లాడారు. వైద్యవిధానంలో వచ్చిన కొత్త అంశాలపై చర్చించారు. కొత్త చికిత్సా విధానాలతో పాటు వచ్చే ఇబ్బందులను కూడా విస్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ సర్వసాధారణం అయ్యిందన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతో పాటు రోగనిర్ధారణలో ఆలస్యం కారణంగా చాలామంది క్యాన్సర్‌ చివరిదశలో హస్పిటల్స్‌కు వస్తున్నారని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నిర్ణీత కాలానుగుణంగా పరీక్షలు చేయించడం ద్వారా ప్రజలు ఈ ప్రమాదం నుండి బయటపడొచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన సమయానికి భోజనం చేయడం, మద్యం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ను అధిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో, సీనియర్‌ కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ వి ధర్మేంద్ర కుమార్‌ మాట్లాడుతూ దేశంలో కొలొరెక్టల్‌ క్యాన్సర్‌తో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్‌ మూడో స్థానంలో వుంటే దేశంలో నాలుగో స్థానంలో వున్నామని తెలిపారు. ఈ క్యాన్సర్‌ను గుర్తించేందుకు అధునాతన స్క్రీనింగ్‌ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటి ద్వారా రోగిలో క్యాన్సర్‌ ఉందనే విషయాన్ని తొలినాళ్లలోనే తెలుసుకునే అవకాశం వుంటుందని అన్నారు. సకాలంలో గుర్తించి సరైన వైద్య విధానాలను పాటిస్తే ముందుగానే నయం చేయొచ్చని అన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నిర్వహణలో శస్త్రచికిత్స ప్రధానమైనదని మణిపాల్‌ హాస్పిటల్‌లో లాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ సర్జరీ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులు అందుబాటు వున్నాయని తెలిపారు. రోగులు క్యాన్సర్‌ చికిత్స కోసం మణిపాల్‌లో అత్యుత్తమ వైద్య చికిత్స, సేవలను పొందవచ్చని తెలిపారు. ఈ సందర్బంగా మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడ డైరెక్టర్‌ డాక్టర్‌ కంటిపూడి సుధాకర్‌ మాట్లాడుతూ ఐఎంఏ, ఎపిఎంసి సహకారంతో కొలరెక్టల్‌ క్యాన్సర్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా వుందన్నారు. చికిత్సా విధానంలో వచ్చిన అధునాతన పద్ధతులను గురించి దేశంలోని సర్జన్లు, ఆంకాలజిస్టులు చర్చించుకోవడం కోసమే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. మణిపాల్‌ హాస్పిటల్‌లో రోబోటిక్‌ సర్జరీ, పెట్‌ సిటీస్కాన్‌ లాంటివి అందుబాటులో వున్నాయని తెలిపారు.