Aug 08,2022 09:58
  • అమలుకు నోచని జగన్‌ పాదయాత్ర హామీలు
  • పరిహారం, పునరావాస కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి దీని పరిధిలోని ప్రజలు భూములు, ఇళ్లను త్యాగం చేశారు. గత టిడిపి ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్ష నేతగా జగన్మోహనరెడ్డి నిప్పులు చెరిగారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి నిర్వాసితునికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పరిహారం రూ.6.50 లక్షలతో పాటు అదనంగా మరో రూ.3.50 లక్షలు కలిపి రూ.10 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వాలు రూ.1.15 లక్షలు, రూ.1.25 లక్షలు చొప్పున చెల్లించాయి. అటువంటి రైతులందరికీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 32 రకాల మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి నిర్వాసితులకు ఇస్తామన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్త్తింపజేస్తామని చెప్పారు. ఈ హామీలను నమ్మిన విలీన మండలాల ప్రజలు వైసిపికి మద్దతు తెలిపారు. అధికారంలోకొచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో, నిర్వాసితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
 

                                                             పరిహారం, పునరావాసం కల్పనలో విఫలం

పోలవరం ప్రాజెక్టు 45.72 కాంటూరు పరిధిలో ప్రభావితమయ్యే ఎనిమిది మండలాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, భూమికి భూమి పథకం అమలు, పునరావాసానికి సంబంధించి రూ.33,470.34 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ రూ.7,480 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఈ పరిధిలో 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, 8,927 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 41.15 కాంటూరు పరిధి వరకూ తన బాధ్యత అని చెబుతున్నారు. అయితే, ఈ పరిధిలోనూ పూర్తి స్థాయిలో నిర్వాసితులకు పునరావాసం కల్పన, పరిహారం చెల్లింపులు జరగలేదు. ఈ పరిధిలో ఐదు మండలాలపై ముంపు ప్రభావం ఉంటుంది. 115 గ్రామాల్లో ఇప్పటి వరకూ 27 గ్రామాలను మాత్రమే తరలించారు. మొత్తం పునరావాస కాలనీలు 75 నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 26 మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఐదు మండలాల్లో 20,946 కుటుంబాలకుగానూ 8,927 కుటుంబాలను మాత్రమే తరలించారు. 12,019 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. భూమికి భూమి పథకంలోనూ, ఆర్‌ అండ్‌ ఆర్‌ చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యం వెంటాడుతోంది. మొత్తం ఈ ప్రక్రియకు రూ.7,906.86 కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకూ రూ.5,581.24 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి.
 

                                                                తాజా పర్యటనలోనూ మొండి చేయి

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముంపు మండలాల్లో ఒకటైన చింతూరులో గత నెల 27న పర్యటించారు. గోదావరి వరద బాధితులను పరామర్శించారు. తమకు పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించిన నిర్వాసితులకు ఈ పర్యటనలోనూ ఆయన మొండి చేయి చూపించారు. పోలవరం నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు వరకే తన బాధ్యతని తెలిపారు. 45.72 కాంటూరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.20 వేలు కోట్లు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. వరద బాధితులకు ఎనిమిది వారాల్లో వరద సాయం అందజేస్తానన్నారు. మిగిలిన విషయాలపై ఆయన ఏమీ మాట్లాడక కేంద్రంపైనే భారం వేశారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రజలతోపాటు అధికార పార్టీ శ్రేణులకూ నిరాశ మిగిల్చింది. తమ అధినేత వైఖరిపై ఆ పార్టీ ముఖ్యనేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

 

sooramma

                                                                          పునరావాసం కల్పించలేదు

మా గ్రామం 41.15 కాంటూరు పరిధిలో ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మా గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ మాకు పునరావాసం కల్పించలేదు. ఇటీవల వరదలకు మా ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. నా భర్త, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లతో రేబాలగుట్టలోని తుపాను షెల్టర్‌లో తలదాచుకున్నాం. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేయాలి.
                 -వల్ల సూరమ్మ, జీడిగుప్ప, విఆర్‌.పురం మండలం

 

swami

                                                                   రూ.10 లక్షల హామీ అమలు చేయాలి

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పరిహారం రూ.10 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. మా గ్రామంలో 130 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని కుటుంబాలకు రూ.6.50 లక్షలు మాత్రమే నగదు జమ చేశారు. మిగిలిన కుటుంబాలకు త్వరలో జమ చేస్తామని చెబుతున్నారు. మిగిలిన రూ.3.50 లక్షలపై ప్రభుత్వం నోరువిప్పడం లేదు. రూ.10 లక్షల హామీ అమలు చేయాలి.
                                                                                                           -ముత్తిబోయిన స్వామి,
                                                                                                   ములకపల్లి, విఆర్‌.పురం మండలం

 

cpm arun

                                                                          హామీలు అమలు చేయాలి

పోలవరం నిర్వాసితులకు ప్రతిపక్ష నేతగా జగన్‌ 2019 ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. విలీన మండలాల్లో రీ సర్వే చేసి ప్రతి గ్రామాన్నీ ముంపు ప్రాంతంగా గుర్తించాలి. అందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలి. కేంద్రం ఇచ్చే నగదుకు అదనంగా రూ.3.50 లక్షలు కలిపి రూ.10 లక్షలు చెల్లిస్తానని ఇచ్చిన హామీ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ సాకు చెప్పడం సరైంది కాదు.
                                                                                -టి.అరుణ్‌,
                                                                    సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు